నగరానికి జ్వరమొచ్చింది | GVMC People Suffering With Fever | Sakshi
Sakshi News home page

నగరానికి జ్వరమొచ్చింది

Published Sat, Nov 9 2019 1:00 PM | Last Updated on Sat, Nov 9 2019 1:12 PM

GVMC People Suffering With Fever - Sakshi

సీఎం ఆరోగ్యకేంద్రంలో వేచివున్న రోగులు

పెదవాల్తేరు(విశాఖతూర్పు): జీవీఎంసీ ఎన్ని చర్యలు చేపట్టనా విశాఖ నగరంలో జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.  ఏ కాలనీలో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  దీంతో నగరంలోని సీఎం ఆరోగ్యకేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చినవాల్తేరు, పెదజాలారిపేట, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం, కంచరపాలెం, బర్మాక్యాంపు, కప్పరాడ, బుచ్చిరాజుపాలెం, ప్రసాద్‌గార్డెన్స్, పాతపోస్టాఫీసు, రెల్లివీథి, హెచ్‌బీకాలనీ, రేసపువా నిపాలెం ప్రాంతాల్లో సీఎం ఆరోగ్యకేంద్రాలు రోజూ అధికసంఖ్యలో వస్తున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో జనాలు బా ధపడుతున్నారు. మలేరియా, డెంగ్యూ రక్తపరీక్షల కోసం ప్రజలు ఆరోగ్యకేంద్రాలను ఆశ్రయి స్తున్నారు. కొన్ని  ఆరోగ్యకేంద్రాలు చిన్న చిన్న గదులలో ఉండటంతో రోగులు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేంద్రాలన్నీ ప్రతి ఆదివారం,  సెలవు దినాలలో కూడా పనిచేస్తాయి.  తగినంత ప్రచారం లేనందు ఆదివారాలలో ఓపీ తగ్గుముఖం పట్టడం గమనార్హం.  కంచరపాలెం కేంద్రంలో  రోజూ 180 నుంచి 200 వరకు ఓపీ నమోదవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చినవాల్తేరు, హెచ్‌బీకాలనీ, ఎంవీపీ కాలనీ వంటి కేంద్రాలలో రోజూ 60 నుంచి 70 వరకు మాత్రమే ఓపీ ఉండేది. ప్రస్తుత జ్వరాల సీజన్‌లో మాత్రం రోజూ 110 నుంచి 150 వంతున ఓపీ నమోదు కావడం గమనార్హం. జ్వరాల సీజన్‌ కావడంతో దాదాపుగా ప్రతీ కేంద్రంలోను ఓపీ వందకు పైగా దాటేయడం గమనార్హం. 

పనివేళలివీ: సీఎం ఆరోగ్యకేంద్రాలన్నీ రోజూ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదివారాలు, పండగరోజులలో కూడా సెలవు లేకుండా పనిచేస్తాయి. మందుల చీటీలను కంప్యూటర్‌ ప్రింటవుట్‌రూపంలో అందజేస్తారు. ఇక్కడ మలేరియా, డెంగ్యూ తదితర రక్తపరీక్షలు చేస్తారు. ఇంకా బీపీ, షుగర్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.  

పారిశుద్ధ్య లోపంతో..
పలు జోన్ల పరిధిలో డస్ట్‌బిన్‌ఫ్రీ సిటీ అంటూ డంపర్‌బిన్లు తొలచేశారు. దీంతో ప్రజలు, అటు పారిశుద్ధ్య కార్మికులు చెత్తచెదారాలను రోడ్లపైనే వేస్తున్నారు. ఈ చెత్త తరలింపులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఫలితంగా దోమలు, ఈగలు వృద్ధిచెంది జ్వరాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఫాగింగ్‌ చేస్తున్నా సరే సత్ఫలితాలు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాలువలు, గెడ్డలు కూడా చెత్తతో నిండిపోతున్నాయి.అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లలోని నీటిపాత్రలను వారంలో ఒకరోజు ఖాళీచేయడం లేదని ఇందువల్ల కూడా దోమల లార్వా వృద్ధి చెందుతుందని జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సెప్టిక్‌ట్యాంక్‌ ఔట్‌లెట్‌ గొట్టాలకు అధికశాతం మంది మెస్‌క్లాత్‌లు అమర్చడం లేదు. ఈ కారణాల చేత కూడా నగరంలో దోమలు బాగా వృద్ధి చెందుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement