కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ మాడ్యూల్స్
జలశుద్ధి కేంద్రం విద్యుత్ బిల్లులను ఆదా చేయడమే గాకుండా.. మరింత విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే వైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందు కోసం శృంగవరపుకోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. ఇక్కడ 1.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించి.. జలశుద్ధి కేంద్రానికి విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మే మొదటి, రెండో వారంలో ప్రారంభానికి సమాయత్తమవుతోంది.
శృంగవరపుకోట రూరల్(విజయనగరం): ఎస్.కోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో 1.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. విశాఖ స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా సుమారు రూ.10 కోట్ల నిధులను ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. 1.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 4800 సోలార్ మాడ్యుల్స్‌ను ఈపీసీ కాంట్రాక్టర్ నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రయివేట్ లిమిటెడ్(జీవీఎస్‌సీసీఎల్) సంస్థ కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మాణ పనులను చేపడుతోంది. ఇక్కడి సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను పోతనాపల్లి వద్ద గల విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. మొత్తంగా మే మొదటి లేదా రెండో వారంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది.
25 ఏళ్ల పాటు ఆదాయం
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సోలార్ మాడ్యుల్స్ ప్లాంట్ ద్వారా 25 సంవత్సరాల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా జీవీఎంసీకి ఆదాయం సమకూరుతుంది. ఇదే సమయంలో కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం నిర్వహణకు అవసరమైన విద్యుత్ వినియోగానికి నెలకు సుమారు రూ.6 లక్షల వరకు బిల్లుల రూపంలో జీవీఎంసీ చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం జలశుద్ధి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను నేరుగా గ్రిడ్‌కు సరఫరా చేయటం వల్ల కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం వినియోగిస్తున్న బిల్లులను మినహాయించుకుని.. అదనంగా తీసుకున్న విద్యుత్‌కు అయిన మొత్తాన్ని జీవీఎంసీ ఖాతాకు విద్యుత్ శాఖ జమ చేయనుంది.
ప్లాంట్ నిర్వహణ ద్వారా పలువురికి ఉపాధి
ఈ సోలార్ మాడ్యుల్స్ ప్లాంట్ నిర్వహణకు సుమారు ఐదు నుంచి ఎనిమిది మంది వ్యక్తులకు ఉపాధి లభించవచ్చని తెలుస్తోంది. 10 నుంచి 15 రోజులకోసారి సోలార్ మాడ్యుల్స్‌పై పేరుకుపోయిన దుమ్ము ధూళిని శుభ్రపరచటం, ప్లాంట్ ఆవరణలో పెరిగిన తుప్పలు, గడ్డి వంటివి తొలగించే పనులు చేయాల్సి ఉంటుంది. ఇక జీవీఎంసీ ఆధ్వర్యంలో ఎస్.కోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రంలోను, సింహాచలం సమీపంలో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ రూపుదిద్దుకుంటోంది. తద్వారా ఆదాయంతో పాటు పలువురికి ఉపాధి కూడా లభిస్తుంది.
త్వరలో ప్రారంభానికిసన్నాహాలు
కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మిస్తున్న 1.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. 4800 సోలార్ మాడ్యుల్స్ ఏర్పాటు ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను నేరుగా విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం. తద్వారా జలశుద్ధి కేంద్రం వినియోగిస్తున్న నెలవారీ విద్యుత్ బిల్లింగ్‌ను కట్ చేస్తారు. అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టయితే అందుకు తగ్గ నిధులను జీవీఎంసీ ఖాతాలో జమ చేస్తారు.– శ్రీనివాస్, ఎలక్ట్రికల్ విభాగం డీఈఈ, జీవీఎంసీ
త్వరితగతినసోలార్ మాడ్యుల్స్ అమరిక
1.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 4800 సోలార్ మాడ్యూల్స్‌ను అమర్చే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందు కోసం రోజుకు 50 మంది పని చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తవుతాయి. ప్లాంట్ నిర్వహణకు కూడా కొంత మందిని తీసుకుంటాం.– జె.నాగరాజు, సైట్ ఇంజినీరింగ్ ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment