
మందుల్లేవ్!
ఏఆర్‌టీ సెంటర్లలో
అరకొరగా మందుల పంపిణీ
పింఛన్ల ఊసే లేదు
కిట్ల సరఫరాను నిలిపివేసిన ఏపీ శాక్స్
ఆందోళనలో హెచ్‌ఐవీ బాధితులు
ఎయిడ్స్ మహమ్మారి సోకినా మందులు వాడితే ఆనందంగా జీవించవచ్చని ఆశలు కల్పించారు. కుమిలిపోతూ కన్నుమూయవద్దని, ఆస్పత్రికి వెళితే ఆయుష్షు పెరుగుతుందని చైతన్యం కల్పించారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రచారం కారణంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులు పరువును పక్కన పెట్టి ప్రాణాలపై ఆశతో ఏఆర్‌టీ సెంటర్లకు వస్తున్నారు. వారికి సరిపడా మందులను మాత్రం ప్రభుత్వం, ఏపీ శాక్స్ అందించడంలేదు. కనీసం వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా సరఫరా చేయడంలేదు. దీంతో కొద్దికాలంగా మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉన్న బాధితుల్లో ఆందోళన మొదలైంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లాలోని ఏఆర్‌టీ సెంటర్ల పరిస్థితి, బాధితులకు అందుతున్న సేవలపై
‘సాక్షి’ ప్రత్యేకంగా ఫోకస్...
లబ్బీపేట : జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 45 వేల మంది హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులు ఉన్నారు. అనధికారికంగా మాత్రం ఆ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా. హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులకు మందులు అందజేసేందుకు బందరుతోపాటు నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీ రిట్రూవెల్ థెరపీ(ఏఆర్‌టీ) సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, నందిగామ, తిరువూరు, అవనిగడ్డ, కంచికచర్ల, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో కూడా లింక్డ్ ఏఆర్‌టీ సెంటర్లను ప్రారంభించారు. ఏఆర్‌టీ సెంటర్లలో 40 వేల మంది వరకు బాధితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారిలో 700 మంది పిల్లలు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగుల్లో సీడీ4 కౌంట్ 250 కన్నా తక్కువగా ఉన్న 14 వేల మంది క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో మరో 10వేల నుంచి 15వేల మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
వేధిస్తున్న మందుల కొరత..
ఏఆర్‌టీ సెంటర్లు ప్రారంభించినప్పుడు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి నెల రోజులకు మందులు ఇచ్చేవారు. మళ్లీ నెల తర్వాత వస్తే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చేవారు. కొద్దికాలం నుంచి మందుల కొరత నెలకొనడంతో 15 రోజులకే ఇస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో బాధితులు నెలకు నాలుగుసార్లు ఏఆర్‌టీ సెంటర్లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక్కొక్కరికీ నాలుగు నుంచి ఆరు రకాల మందులు అందించాల్సి ఉండగా కొన్ని అందుబాటులో ఉండటంలేదు.
కిట్ల సరఫరాకు బ్రేక్
స్వచ్ఛందంగా ఏఆర్‌టీ సెంటర్లకు వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేకపోవడంతో ప్రయివేటు ల్యాబ్‌లకు పంపుతున్నారు. గతంలో హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న గర్భిణులకు ప్రసవం, సిజేరియన్ ఆపరేషన్లు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీ శాక్స్) ప్రత్యేక కిట్లు అందజేసేది. ఏడాదిగా ఈ కిట్ల సరఫరాను ఏపీ శాక్స్ నిలిపివేయడంతో బాధిత గర్భిణులు రూ.2 వేల వరకు వెచ్చించి బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
పింఛన్లూ ఇవ్వలేడం లేదు
క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు ఏఆర్‌టీ సెంటర్లకు వచ్చి మందులు తీసుకెళ్లే బాధితులకు నెలకు రూ.1,000 చొప్పున పింఛను అందించాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాలో సుమారు వేలాది మందికి పింఛను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆరు నెలలుగా 500 మందికి కూడా అందజేయడంలేదు. దీంతో నెలకు నాలుగుసార్లు మందుల కోసం వస్తున్న బాధుతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సెకండ్ లైన్‌లో వైద్యులు లేరు..
ఏఆర్‌టీ సెంటర్లలో ఇచ్చే మందులు పనిచేయనివారి కోసం సెకండ్ లైన్ ఏఆర్‌టీ సెంటర్‌ను రెండేళ్ల క్రితం నగరంలో ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి కూడా రోగులు వస్తున్నందున ఈ సెంటర్‌లో ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఏపీ శాక్స్ నిర్ణయించింది. నేటి వరకు నియమించకపోవడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యులే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సెంటర్‌లో ఒక్కో రోగికి నెలకు రూ.5వేల విలువైన మందులు అందజేస్తారు. ఇక్కడ కూడా ఒక్కోసారి మందుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏఆర్‌టీ సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలని, పింఛన్లు అందించాలని బాధితులు కోరుతున్నారు.
చైతన్యం పెరిగింది
ఐదేళ్ల క్రితం హెచ్‌ఐవీ బాధితులు వైద్యం కోసం వచ్చేందుకు ఇబ్బందిగా భావించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. చైతన్యం పెరిగింది. సహజ వ్యాధులు సోకినట్లే వచ్చి మందులు తీసుకువెళ్తున్నారు. సక్రమంగా మందులు వాడనివారు, మందులు వాడినా మద్యం తాగడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఏటా 8శాతం మంది మృత్యువాత పడుతున్నారు.
- కె.సత్యనారాయణ, ప్రభుత్వాస్పత్రి ఏఆర్‌టీ సెంటర్ నోడల్ అధికారి
నేడు అవగాహనా ర్యాలీ
గతంలో కంటే హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థల కృషి ఉంది. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం నగరంలోని గాంధీనగర్ శారదా కాలేజీ నుంచి ఘంటసాల సంగీత కళాశాల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. సుమారు ఐదు వేల మంది పాల్గొంటారు. అక్కడే రాష్ట్ర స్థాయి సదస్సు కూడా నిర్వహిస్తాం.
- డాక్టర్ టీవీఎస్‌ఎన్ శాస్త్రి,
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి