నెల్లూరు(విద్య) : నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. ఎనిమిది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు కళాశాల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపల్‌గా మాల్యాద్రిచౌదరి పనిచేస్తున్నారు. వాసవి, సాయికుమార్ అనే సీనియర్ ఇంటర్ విద్యార్థులు చంద్రశేఖర్, రాజేంద్రబాబు, వెంకటేష్, అభిలాష్, అజయ్‌కుమార్, రాజేంద్రలు అనే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు హాజరుతగ్గడంతో బోర్డు నిబంధనలను అనుసరించి హాల్‌టికెట్లు ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ తేల్చిచెప్పేశారు.
వారిలో బైపీసీ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఐదుగురు, ఎంపీసీ ఒకరు, సీనియర్ ఇంటర్‌లో ఎంపీసీ ఒకరు, బైపీసీ ఒకరు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు అటెండెన్స్ సరిపోకపోతే కాండోనేషన్ ఫీజు కట్టించుకొని పరీక్షలు రాయించవచ్చుననేది బోర్డు నిబంధన. సైన్స్ విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండి తీరాల్సిందే. 60 నుంచి 70 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అయితే ఈ కళాశాల విద్యార్థులకు 40 నుంచి 60 శాతం ఉండటంతో ప్రిన్సిపల్ వీరికి హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఎంతమంది సర్దిచెప్పినా ప్రిన్సిపల్ ససేమిరా అనడంతో విద్యార్థులు ఏమీ చేయలేకపోయారు. కళాశాల భవనంపై చేరి నినాదాలు చేశారు.
సెల్ఫ్ సెంటర్‌పై వివాదాలు...
సౌత్‌మోపూరు కళాశాల సెల్ఫ్‌సెంటర్. అక్కడ చదివే విద్యార్థులు అక్కడే పరీక్షలు రాస్తారు. సుమారు 212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఏడాది పొడవునా విద్యార్థుల అటెండెన్స్ విషయం పట్టించుకోవాల్సిన ప్రిన్సిపల్ ఆ విషయాన్ని పరీక్షలప్పుడే పట్టుబట్టడంపై పలు వివాదాలకు తావిస్తోంది.
వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని ప్రిన్సిపల్ వాదిస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యాసంవత్సరం మొత్తం మీద వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికుల వాదన. అయితే విద్యార్థుల వద్ద నుంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని వాటినే షోకాజ్ నోటీసులుగా చూపుతూ ప్రిన్సిపల్ వాదనకు దిగడం విడ్డూరమని గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీవీఈఓ బాబు జాకబ్ కళాశాలను సందర్శించారు. పూర్వాపరాలను ఆరా తీశారు. డీవీఈఓ చెప్పినా ప్రిన్సిపల్ ఒప్పుకోకపోవడంతో ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే పరీక్షా సమయం కాస్త అయిపోయింది. ఇక చేసేదిలేక ప్రిన్సిపల్‌ను కలెక్టర్‌కు వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వమన్నారు. కనీసం గురువారం జరిగే సెకండియర్ పరీక్షను రాసే ఇద్దరికన్నా అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
అందరూ పేద విద్యార్థులే..
కళాశాలలో చదివే విద్యార్థుల ఆర్థిక నేపథ్యం అంతంతమాత్రమేనని సమాచారం. పుస్తకాలు, ఫీజులు కట్టాలంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూలి పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో ఫీజులు కడతారనేది స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమం లో అనేక మంది దాతలు కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నారు.
విద్యాసంవత్సరం అంతటిలో ఇంత పట్టుపట్టి ఉంటే వారు కళాశాలకు వచ్చి ఉండేవారని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు ఎలా పరీక్ష రాస్తారో చూస్తానంటూ జీఓను సాకుగా చూపడం పలువురు విస్మయానికి గురిచేసింది. అధికారు లు స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
హాల్‌టికెట్ల హైడ్రామా
Published Thu, Mar 12 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement