చితికిపోతున్న చేనేత బతుకులు
- ముడి సరుకు పంపిణీని నిలిపేసిన పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ
- పనిలేక వలసపోతున్న చేనేత కార్మికులు
- ఆదుకునేవారే కరువయ్యారంటూ ఆవేదన
సంతకవిటి: చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మొన్నటి వరకు దర్జాగా బతికినవారు నేడు పనులు లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. మరికొందరు పొట్టచేతపట్టుకుని వలసపోతున్నారు. దీనికి సంతకవిటి మండలంలోని సురవరం, మందరాడ, మామిడిపల్లి, కాకరాపల్లి, మండాకురిటి తదితర గ్రామాల్లోని వందలాది చేనేత కార్మిక కుటుంబాల జీవనకష్టాలే సజీవసాక్ష్యం. ఈ గ్రామాల్లోని చేనేత కార్మికులు పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థలో సభ్యులుగా ఉండేవారు. దీంతో సంస్థ ముడిసరుకును అందజేస్తే వాటిని మగ్గాలపై నూలువడికి తిరిగి సరఫరా చేసేవారు.
దీంతో మహిళలకు కూడా చేతినిండా పని ఉండేది. సీజన్‌తో సంబంధం లేకుండా పనిదొరికేది. ఇంటిదగ్గరే ఉంటూ రోజుకు రూ.60 నుంచి రూ.70వరకు ఆదాయం పొందేవారు. పురుషులు వస్త్రాలను నేసి డబ్బులు సంపాదించేవారు. దీంతో జీవనం సాఫీగా సాగిపోయేది. ఏడాదిగా ఆంధ్రాఫైన్ కార్మికాభివృద్ధి సంస్థ వీరి బాగోగులను పక్కనపెట్టింది. ముడిసరుకైన పత్తిని ఇవ్వడం నిలుపుదలచేసింది. ఫలితంగా వీరికి పనిలేక రోడ్డున పడ్డారు. ఈ గ్రామాల్లోని సుమారు 300 కుటుం బాల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది గుంటూరు, చీరాల ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. మరికొంత మంది తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
చేనేత కార్మికులు పనిలేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యార ని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు అందజేయడం లేదని, అర్హులకు కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేయడంలేదంటూ వాపోతున్నారు.
ముడిసరుకు లభించడంలేదు...
గతంలో జిల్లాలో పత్తి విరివిగా లభించేంది. చౌకగా కొనుగోలుచేసి సురవరంలోని చేనేత కార్మికులుకు అందించేవాళ్లం. వారు వాటిని ఒడికి నూలు తయారుచేసి మాకు ఇచ్చేవారు. గతేడాది నుంచి పంటలు పండక పత్తి దొరకడం లేదు. అందుకే ముడిసరుకు అందించలేకపోతున్నాం.
- కె.సుధాకర్, పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ సంస్థ ప్రతినిధి
ఇబ్బందులు పడుతున్నాం...
ముడిసరుకు ఇవ్వకపోవడంతో మాకు పనులులేవు. ఉపాధిపనులు కూడా వేసవిలో తూతూ మంత్రంగా ఉంటున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోతున్నాయి. బతకడం కష్టంగా మారింది.
- దువ్వాకుల సుశీల, చేనేతకార్మికరాలు, సురవరం
వలసలే గతి..
స్థానికంగా పనిలేక గ్రామంలో పురుషులంతా పట్టణాలకు వలసబాటపడుతున్నారు.అక్కడ కష్టంగా ఉండడంతో మహిళలను తీసుకెళ్లడంలేదు. మేం ఇంటివద్దే ఉంటున్నాం.
-ఎ.వరలక్ష్మి, చేనేత కార్మికరాలు, సురవరం