పూర్తి కాని లక్ష్యం.. నెలరోజులే గడువు
డిపాజిట్, ఇతరత్రా కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు
భువనగిరి, న్యూస్‌లైన్: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా తయారైంది జిల్లాలో చేనేత కార్మికుల రుణాల పరిస్థితి. చేనేత కార్మికులకు రూ.25వేల నుంచి 2లక్షల రూపాయల వరకు రుణవసతి కల్పించి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా చేనేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి పెట్టుబడి వసతి కల్పించేదుకు క్యాష్ క్రెడిట్ రుణాలను మంజూరు చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుంది. రుణాల మంజూరుకు జౌళిశాఖ జిల్లాలో 11000 మంది చేనేత కార్మికులను లబ్ధిదారులుగా గుర్తించింది. లబ్ధిదారుల జాబితాలను బ్యాంకులకు పంపిం చింది. రుణాల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ప్రత్యేక చొరవతో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన చేనేత కార్మికులందరికీ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. అయినా సుమారు మూడు నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతున్నా ఆశించిన స్థాయిలో రుణ పంపిణీ జరగడం లేదు. బ్యాంకర్లు చేనేత కార్మికులకు రుణాలివ్వడంలో కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటివరకు 1380మందికే రుణాలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి చివరి వరకు ఇవ్వకపోతే ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో రుణాలను వాయిదా వేసే పరిస్థితి ఉంది.
బ్యాంకర్ల కొర్రీలు....
రుణాలు వస్తాయని ఆశపడిన చేనేత కార్మికులకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు.
తక్కువలో తక్కువగా 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ.25 వేలు, రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నారు.
ఈ రుణం ఇవ్వడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు.
చేనే త కార్మికులకు బ్యాంకులో ఖాతాలు లేవని అందువల్ల రుణాలు ఇవ్వలేమంటూ బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు.
కొన్ని చోట్ల లబ్ధిదారులు డిపాజిట్ చేస్తేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు.
దీంతో రుణాలు పొందడం కోసం చేనేత కార్మికులు డిపాజిట్ మొత్తం కోసం వడ్డీలకు తెస్తున్నారు. దీంతో వారు మరింత అప్పుల పాలవుతున్నారు.
ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి
చేనేత కార్మికుల రుణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. ఇప్పటివరకు జరుగుతున్న రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈలోపు రుణ పంపిణీ జరగపోతే రుణాలు మురిగిపోయే ప్రమాదం ఉంది. లేదా గత సంవత్సరం రుణాలంటూ బ్యాంకర్లు పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన రుణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే బ్యాంకర్లు సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తమ ఇబ్బందులు పట్టించుకోవాలని వారు అంటున్నారు.
రూ.50 వేలు ఇస్తేనే మార్జిన్ మనీ వస్తుంది : సంజీవరావు, జౌళిశాఖ ఏడీ
చేనేత కార్మికులకు బ్యాంకులు కచ్చితంగా రూ.50 వేల రుణం ఇవ్వాలి. అప్పుడే వారికి నాబార్డునుంచి 10 రూపాయల మార్జిన్ మనీ వస్తుంది. కొన్ని బ్యాంకులు రూ.25, రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీని వల్ల చేనేత కార్మికులు నష్టపోతారు. ఏ బ్యాంకులో రూ.50 వేల కంటే తక్కువ రుణం ఇస్తే తన దృష్టికి తీసుకురావాలి.
చిక్కిపోతున్న చేనేత..
Published Tue, Feb 4 2014 4:32 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement