హంద్రీ-నీవా పూర్తయితేనే సీమ అభివృద్ధి
వజ్రకరూరు : దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమపై టీడీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. హంద్రీ-నీవాకు 100 టీఎంసీల నీటిని కేటాయించాలని, మొదటిదశ కింద ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీరివ్వడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28,29 తేదీల్లో ఉరవకొండలో తాను చేపట్టనున్న 25 గంటల దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఆయన వజ్రకరూరు మండలం చిన్నహోతూరు, గడేహోతూరు, చాబాల, పొట్టిపాడు తదితర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హంద్రీ-నీవా పూర్తయితేనే రాయలసీమ అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందన్నారు. సీమకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒకతాటిపైకి వచ్చి దీక్షకు మద్దతు ఇవ్వబోతున్నారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయంటే అది వైఎస్సార్ కృషి ఫలితమేనని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ-నీవా పథకానికి రూ.4600 కోట్లు కేటాయించి 90శాతం పనులను పూర్తి చేయించారని గుర్తు చేశారు.
చంద్రబాబు సీఎంగా రెండుసార్లు హంద్రీ-నీవా పథకానికి శంకుస్థాపనలు చేసినప్పటికీ కిలోమీటరు కూడా కాలువ పనులు చేపట్టలేదన్నారు. ఆయన మరోమారు జిల్లా ప్రజలను వంచించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గోదావరిపై పట్టిసీమ పేరుతో రూ.1,300 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వ తనయుడు, జిల్లా యువజన నాయకుడు వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం తాలుకా కమిటీ సభ్యురాలు శైలాజా రాజశేఖరరెడ్డి, ఎంపీపీ కోర్రా వెంకటమ్మ, వైస్ ఎంపీపీ చాబాల నారాయణప్ప, పార్టీ మండల కన్వీనర్లు జయేంద్రరెడ్డి, భూమా కమలారెడ్డి, ఎంపీటీసీ దేవేంద్ర, నాయకులు నారాయణరెడ్డి, శివరామిరెడ్డి, విజయ్, కిశోర్‌రెడ్డి, సోమిరెడ్డి, ఆది, ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ముండాసు ఓబుళేసు, ముత్యాల్, పరమేష్, రామలింగ, చిన్నపులికొండ, మునిరెడ్డి, ఇమామ్, సింగిల్‌విండో డెరైక్టర్ వసంతనాయుడు పాల్గొన్నారు.