హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం
► డిస్ట్రిబ్యూటరీలను వెంటనే నిర్మించాలి
► ఆయకట్టుకు నీటి సాధన కోసం ఐక్య పోరాటం
► రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు
అనంతపురం రూరల్ : హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం అనంతపురంలోని ఎన్‌జీవో హోంలో హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించి జిల్లాలోని 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి.. రూ.6,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో హంద్రీ-నీవాకు రూ.558 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని చూస్తే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.
దీనిద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించినప్పటికీ హంద్రీ-నీవాను పూర్తి చేసి అనంతపురం జిల్లాకు నీరందిస్తామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే పట్టిసీమను పక్కన పెట్టి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ వైపు మొగ్గు చూపారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరా ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం జిల్లాకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్యపరచి ఐక్యఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా పనులకు రీ టెండర్లు పిలిచి ఐదు రెట్లు ఎక్సెస్‌కు టీడీపీ అనుయాయులకు కేటాయించారని విమర్శించారు. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 33వప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టిన టెండర్లను సైతం రద్దు చేశారన్నారు. కుప్పంకు నీరు తీసుకుపోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన కాలువ పనులను మాత్రమే వేగవంతం చేయిస్తున్నారని విమర్శించారు.
సీపీఐ సీనియర్ నేత రమణ మాట్లాడుతూ జిల్లా నాయకులు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ఆయకట్టుకు నీటి సాధన కోసం ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతు ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రతి ఎకరాకు సాగు నీరు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు కేవీ రమణ, అఖిల పక్ష నాయకులు జాఫర్, రంగారెడ్డి, కదలిక ఇమామ్, పెద్దన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, శరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.