హనుమంత వాహనంపై శ్రీరాముడి రాజసం
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. వాహన సేవ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గజ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామి వారు గజరాజు వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్‌వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణశర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శ్రీరామ పట్టాభిషేకం హరికథ పారాయణం
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం కడప సవేరా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామపట్టాభిషేకం హరికథా పారాయణం భక్తులకు ఆకట్టుకుంది. రామచంద్ర పుష్కరిణి వేదికపై ఎల్.శ్రీనివాసరావు గానం చేసిన శ్రీరామజననం హరికథా గానం అలరించింది.