తప్పును ఎత్తిచూపితే వేధిస్తారా? | Harassing, pointing out the error? | Sakshi
Sakshi News home page

తప్పును ఎత్తిచూపితే వేధిస్తారా?

Published Thu, Oct 16 2014 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

తప్పును ఎత్తిచూపితే వేధిస్తారా? - Sakshi

తప్పును ఎత్తిచూపితే వేధిస్తారా?

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
నల్లధనం వెలికితీతపై పిల్ వేిసిన ఐఏఎస్‌కు బాసట
ఆయనపై కక్ష సాధింపులకు దిగిన కేంద్రానికి తలంటు
రూ. 5 లక్షల జరిమానా

 
హైదరాబాద్: వ్యక్తిగత లేదా ప్రజా సంబంధిత సమస్యల విషయంలో న్యాయ పరిష్కారం కోరే హక్కు రాజ్యాంగ హక్కులకు సంబంధిం చిదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకూ ఈ హక్కులు వర్తిస్తాయని పేర్కొంది. తద్వారా ప్రభుత్వాల తప్పులను, లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను దాఖలు చేయొచ్చని పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సిక్రితో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వ తప్పులను, లోటుపాట్లను ఎత్తిచూపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారన్న కారణంతో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా అతనికి పదోన్నతి నిరాకరించి, అభియోగాలు మోపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేంద్రం తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే వారికీ ఇదే గతి పడుతుందనే హెచ్చరికలు పంపడానికే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేసినందుకు కేంద్రానికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. వేధింపులకు గురైన ఐఏఎస్ అధికారికి ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. బాధ్యులైన వారిని గుర్తించి, వారి నుంచే ఈ మొత్తాలను వసూలు చేసుకోవాలని వ్యాఖ్యానించింది.

నల్లధనం వెలికితీత విషయంలో ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్‌శంకర్ పాండే సుప్రీం కోర్టులో గతంలో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేంద్రానికి పలుమార్లు తలంటింది. ఇవ న్నీ ఇబ్బందిగా పరిణమించడం తో, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా పిల్ దాఖలు చేయడం క్రమశిక్షణారాహిత్యమేనంటూ పాండేపై చర్యలు తీసుకుంది. అతనిపై ఐదు అభియోగాాలు మోపుతూ విచారణకు సైతం ఆదేశించింది. దీనిపై అతను అలహాబాద్ హై కోర్టు, అక్కడి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరకు అతను సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. దీనిపై ధర్మాసనం లోతుగా విచారణ జరిపింది. వాదనల అనంతరం జస్టిస్ చలమేశ్వర్ తీర్పు వెలువరిస్తూ కేంద్రం తీరును తప్పుబట్టారు. పిటిషనర్ విజయ్‌శంకర్ పాండేకు విచారణాధికారి క్లీన్‌చిట్ ఇస్తూ నివేదిక ఇస్తే దాన్ని తిరస్కరించి, మరో విచారణ కమిటీని ఏర్పాటు చేయడాన్ని తీర్పులో ఎత్తిచూపారు.

పాండేపై మోపిన అభియోగాలు ఇక్కడ వర్తించవని తేల్చి చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగపరమైన విధులను నిర్వహించడంలో విఫలమైదన్న ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేస్తే అది ఏ విధంగా క్రమశిక్షణారాహిత్యం అవుతుందో.. విధుల పట్ల చిత్తశుద్ధి కనబరచకపోవడం కిందకు వస్తుందో మాకు అర్థం కాకుండా ఉంది. నల్లధనంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం ద్వారా దేశాన్ని ఆర్థికంగా, భద్రతాపరంగా బలహీనపరచారన్న కేంద్రం వాదన ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు’ అని ధర్మాసనం పేర్కొంది.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement