విత్తన భాండాగారానికి ‘బహుళజాతి’ దెబ్బ | Hard times for a seed farmer in Kurnool district | Sakshi
Sakshi News home page

విత్తన భాండాగారానికి ‘బహుళజాతి’ దెబ్బ

Published Sat, Oct 26 2019 4:32 AM | Last Updated on Sat, Oct 26 2019 4:32 AM

Hard times for a seed farmer in Kurnool district - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు జిల్లా ఒకనాడు విత్తనోత్పత్తికి ప్రధాన కేంద్రం. లక్ష ఎకరాల్లో ఉత్పత్తి జరిగేది.  దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవారు. 20 ఏళ్ల క్రితమే 250 వరకు విత్తన పరిశ్రమలు, ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉండేవి. దాదాపు 30వేల మంది రైతులు విత్తనోత్పత్తి చేపట్టి లాభాలు పొందేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60వేల మందికి ఉపాధి లభించేది. బహుళజాతి సంస్థలు ప్రవేశపెట్టిన బీటీ పత్తితో నేడు జిల్లాలోని విత్తన పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బడా కంపెనీలకు అనుకూలంగా చంద్రబాబు సర్కారు కో–మార్కెటింగ్‌ను రద్దు చేయడంతో  విత్తనోత్పత్తికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విత్తనోత్పత్తి, విత్తన పరిశ్రమకు సంబంధించి జిల్లాకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది.  

దేశంలోనే సీడ్‌ హబ్‌గా నాడు గుర్తింపు 
2001కి ముందే కర్నూలు జిల్లాకు సీడ్‌ హబ్‌గా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. హైబ్రిడ్‌ పత్తిరకాలతో పాటు కూరగాయల విత్తనాలు, జొన్న, మొక్కజొన్న, కొర్ర, మినుము, శనగ, పెసర, వేరుశనగ తదితర విత్తనాల ఉత్పత్తి జరిగేది. నంద్యాల ప్రాంతం వరి విత్తనోత్పత్తికి పెట్టింది పేరు. జాతీయస్థాయి విత్తన సంస్థలు కూడ ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవి. ఏటా  రూ.850 కోట్ల విలువైన హైబ్రిడ్‌ పత్తి,  రూ.150 కోట్ల విలువగల కూరగాయలు, ఇతర పంటల విత్తనాల ఉత్పత్తి చేసేవారు. ఏటా రూ.100 కోట్ల విలువ చేసే విత్తనాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి.  

బీటీ దెబ్బ– కంపెనీలు మూత 
ముఖ్యంగా పత్తిలో బీటీ రకాలు వచ్చిన తర్వాత హైబ్రిడ్‌ పత్తి విత్తనోత్పత్తి మనుగడ కోల్పోయింది. ప్రఖ్యాతి గాంచిన దేశీయ కంపెనీలు జిల్లాలో విత్తన పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని విత్తనోత్పత్తితో రైతులకు, వేలాది మంది కూలీలకు పనులు కలి్పంచేవి. బీటీ పత్తి రాకతో పెద్ద కంపెనీలు వెళ్లిపోగా.. అనేక చిన్న కంపెనీలు మనుగడను కోల్పోయాయి.   

నిర్వీర్యమైన ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ... 
దశాబ్దాల క్రితం ఇక్కడ ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అథారిటీ కూడా నేడు నిర్వీర్యమైంది. గతంలో రైతులు, చిన్న విత్తన కంపెనీలు, యూనివర్శిటీల నుంచి బ్రీడర్‌ సీడ్‌ తెచ్చుకొని ఫౌండేషన్‌ సీడ్‌ను ఉత్పత్తి చేసేవి. విత్తన నాణ్యతను ఈ అథారిటీ ధ్రువీకరించిన తర్వాతనే మార్కెట్‌లోకి విడుదల చేసేవారు. రైతులు  విత్తనాలను సరి్టఫై చేసేవారు. బీటీ రకాలు వచి్చన తర్వాత జిల్లాలో విత్తనోత్పత్తి లక్ష ఎకరాల నుంచి కేవలం 10వేల ఎకరాలకు పడిపోయింది.  

పూర్వవైభవం పొందాలంటే.... 
విత్తనోత్పత్తికి జిల్లా భూములు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయి. రైతులకు పలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. కర్నూలును పత్తి విత్తన కేంద్రంగా, నంద్యాల వరి విత్తన కేంద్రంగా, తంగడంచె ఫాంను కూరగాయల విత్తనాలు, ఇతర విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ది చేయవచ్చు.  

విత్తనోత్పత్తి తగ్గిపోయింది 
పత్తి విత్తనోత్పత్తి రైతులకు లాభసాటిగా ఉండేది. విత్తన కంపెనీలు రైతులకు బ్రీడర్‌ సీడ్, ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చి  ప్రోత్సహించేవి. బీటీ దెబ్బతో ఆ కంపెనీలు మూతపడ్డాయి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మళ్లీ హైబ్రిడ్‌ విత్తన ఉత్పత్తిని చేపట్టి రైతాంగం అభివృద్ధి చెందుతుంది.
– పి.నరసింహారావు, రైతు, చెరుకులపాడు, కర్నూలు జిల్లా 

చంద్రబాబు దెబ్బ–రైతులు కుదేలు  
టీడీపీ ప్రభుత్వం కో–మార్కెటింగ్‌ వ్యవస్థను రద్దు చేయడంతో విత్తన ఉత్పత్తి దెబ్బతింది. గతంలో బడా కంపెనీలు స్థానిక కంపెనీలకు ఫౌండేషన్‌ విత్తనాలు ఇచ్చేవి. స్థానిక కంపెనీలు రైతులతో విత్తనాల ఉత్పత్తి చేయించి సొంత బ్రాండ్స్‌తో (కో–మార్కెటింగ్‌) అమ్ముకునేవి. రైతులకూ లాభదాయకంగా ఉండేది. బహుళ జాతి కంపెనీల ఒత్తిడితో చంద్రబాబు సర్కారు కో–మార్కెటింగ్‌ వ్యవస్థను ఏక పక్షంగా రద్దు చేసింది. దాంతో స్థానిక కంపెనీలు మూతపడ్డాయి. రైతులతో విత్తనాలు ఉత్పత్తి చేయించే వారే లేరు. చిన్నచిన్న కంపెనీలను బహుళజాతి కంపెనీలు అణగతొక్కాయి. హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి చేసే రైతులకు, విత్తన కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే కర్నూలు జిల్లా మళ్లీ సీడ్‌ హబ్‌గా మారుతుంది. 
– ఎంవీ రెడ్డి, వైస్‌ చైర్మన్, సీడ్‌ మెన్‌ అసోసియేషన్, కర్నూలు జిల్లా

విత్తన పరిశ్రమ అభివృద్ధికి చేయూత 
విత్తనోత్పత్తికి కర్నూలు జిల్లా భూములు, వాతావరణం అనుకూలం. అందువల్ల నూతన ప్రభుత్వం కర్నూలు జిల్లాలో విత్తన ఉత్పత్తికి పలు చర్యలు చేపట్టబోతోంది. జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచె ఫాంను అత్యాధునికంగా తీర్చిదిద్ది రైతులు విత్తనాలు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పత్తితో పాటు వరి, కూరగాయలు, ఇతర విత్తనోత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం.  
– పి.విల్సన్,జేడీఏ, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement