నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు తహసీల్దార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. సంఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గ్రామానికి చెందిన సమ్యద్ మక్దుల్ బాషా 5 ఎకరాలకు పైగా ఉన్న భూమిని తన పేరుమీద పట్టాచేయాలని మండల తహశీల్దార్‌ను సంప్రదించాడు. అయితే, ఆ భూమికి పట్టా కోసం రూ. 4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దిక్కు తోచని రైతు సెల్ టవర్ ఎక్కి తన తమ్ముడి కుమారుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న తమ్ముడి కొడుకు టవర్ దగ్గరకు చేరుకొని 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, సెల్‌టవర్‌పై ఉన్న సమయంలోనే అతనికి గుండెపోటు రావడంతో రైతు అక్కడికక్కడ మృతిచెందాడు.