కోతల వెతలు
=వేళాపాళా లేని విద్యుత్ కోతలు
= రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారుల అవస్థలు
సాక్షి, మచిలీపట్నం : జిల్లా వాసులకు విద్యుత్ కోతల వెతలు తప్పడం లేదు. విద్యుత్ శాఖ అధికారుల మాటల్లానే కరెంటు సరఫరా సైతం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కోతల్లో వేళాపాళా లేకపోవడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో రైతులు, విద్యుత్‌పై ఆధారపడిన చిన్నతరహా పరిశ్రమల వారు, చిరు వ్యాపారులు, పదోతరగతికి సిద్ధమవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముందుగా ప్రకటించిన కోతలు ఇలా...
విద్యుత్ ఉత్పత్తి పడిపోయిన నేపథ్యంలో ఈ నెల రెండోతేదీ నుంచి అధికారికంగా కరెంటు కోతలను విధిస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, విజయవాడల్లో రోజుకు మూడేసి గంటలు, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో నాలుగేసి గంటలు, 49 మండల కేంద్రాల్లో ఆరేసి గంటలు, గ్రామాల్లో తొమ్మిది గంటల చొప్పున కరెంటు కోతలను విధించేలా అధికారికంగా ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత, పలు యూనిట్లలో మరమ్మతులు కారణంగా కరెంటు కొరత వచ్చిందని, అందుకే కోతలు విధిస్తున్నామని ఈ నెల ఒకటిన పేర్కొన్నారు.
ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో రీతిలో...
వాస్తవంగా అధికారులు ప్రకటించిన సమయాల్లో కరెంటు కోతల అమలు ఎలా ఉన్నా జిల్లాలో వేళాపాళా లేకుండా కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశిత వేళల్లో కాకుండా అధికారుల చిత్తమొచ్చినట్టు కోతలు అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయం, మరికొన్నిచోట్ల అత్యధిక సమయం కోతలు ఉంటున్నాయి. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే విద్యుత్ ఉత్పత్తి బాగున్నప్పుడు బాగానే సరఫరా చేస్తున్నామని, కొరత ఏర్పడినప్పుడు లోడ్ రిలీఫ్ కోసం ఏదో ఒక ప్రాంతానికి కోత పెడుతున్నామని చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఏ ప్రాంతానికి పవర్ కట్ చేయమని చెబితే అక్కడే కోతలు అమలు చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లా అంతటా అధికారులు ప్రకటించినట్టు పూర్తిగా అధికారిక కోతలు అమలు జరగడంలేదు. కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో కోతలు అమలు చేయడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.
విద్యార్థులకు కష్టం.. రైతులకు నష్టం...
జిల్లాలో విద్యుత్ కోతల అమలులో సమయపాలన లేకపోవడం పదో తరగతి విద్యార్థులకు కష్టంగాను, రైతులకు నష్టం తెచ్చేదిగాను మారింది. మార్చి 27 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. సమైక్య ఉద్యమంతో దాదాపు రెండు నెలలకు పైగా విద్యాసంస్థలు మూతపడటంతో సిలబస్ పూర్తికాలేదు. దీంతో ప్రైవేటు క్లాసులు, ఇంటి వద్ద చదువుకుంటూ విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో కరెంటు కోతలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌కు రాత్రివేళ కోతలు తీవ్రమయ్యాయి. అరగంట ఇస్తే మరో అరగంట కోతలు అమలు చేయడంతో ఇటీవల ముసునూరు తదితర ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరెంటు కోతలు తగ్గించకుంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. దీనికితోడు జిల్లాలోని చిన్న పరిశ్రమల నిర్వాహకులు, కారం మిల్లులు, పిండి మరలు, వెల్డింగ్, ఫొటోస్టాట్ తదితర చిరు వ్యాపారులు వేళాపాళా లేని కరెంటు కోతల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలపై ఉన్నతాధికారులు స్పష్టమైన వైఖరి అవలంబించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.