సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు
పాటల రచయిత వెన్నెలకంటి
విజయవాడ : ఆయన పాట యువతీ యువకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. లాలి పాట రాసినా, ప్రేమ, విరహగీతాలు రచించినా, ప్రబోధ గీతాలకు అక్షర రూపం ఇచ్చినా ఆయన ముద్ర కనపడుతుంది. సినీ కవిగా 25 ఏళ్ల ప్రస్థానానికి చేరుకున్న ఆయనే వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. విజయవాడలో ఆదివారం జరిగిన మహాకవి శ్రీశ్రీ పాటల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు.
కల్చరల్ : సినీ కవిగా మీ ప్రస్థానం సంతృప్తికరంగా సాగుతోందా?
వెన్నెలకంటి : ఇక్కడ ఒక విషయం చెప్పాలి... కవిగా నా సినీ జీవితం ఎప్పుడూ సంతృప్తి కరంగానే సాగింది. నాకు సంబంధించినంత వరకు నా నిర్మాతలు, దర్శకుల నుంచి ఎప్పుడూ ఒత్తిడులకు లోను కాలేదు. సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు.
కల్చరల్ : తెలుగు సినీ కవుల్లో పాండిత్యంగలవారు చాలా మంది ఉన్నారు. అరుుతే కేవలం ముగ్గురికే జాతీయ వార్డులు వచ్చాయి. మిగిలినవారికి రాకపోవడానికి కారణం?
వెన్నెలకంటి : అవార్డుల కమిటీలో మన తెలుగువారు లేక పోవడమే ప్రధాన కారణం. పాటల్లో సాహిత్యపు విలువలు ఉన్నా, సంబంధిత కమిటీ వారికి అవగాహన లేక పోవడం, మిగతా భాషల వారితో పోలిస్తే మనకు మన భాషపై మమకారం లేకపోవడమూ కారణమే.
కల్చరల్ : సినీ సాహిత్యం నేడు బూతు వానలో తేలిపోవడంపై మీ స్పందన?
వెన్నెలకంటి : యువకుల భావజాలం మారుతోంది. అందుకు తగిన విధంగానే సినిమాలు తయారవుతున్నాయి. బూతయినా, శృంగారమైనా కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
కల్చరల్ : సినీగీతాల్లో శబ్ధ కాలుష్యం పెరిగిపోతోంది. సాహిత్యం కనపడటంలేదు కదా?
వెన్నెలకంటి : ఏ వస్తువైనా డిమాండ్‌ను బట్టి తయారవుతుంది. తెలుగు సినీగీతాల పరిస్థితీ అంతే. అయినా అంత నిరాశాజనకంగా మాత్రం తెలుగుపాటలు లేవు. మంచి పాటలు అరుదుగా వస్తూనే ఉన్నాయి.
కల్చరల్ : పాట కలకాలం నిలవాలంటే..?
వెన్నెలకంటి : సంగీతం, సాహిత్యం, సందర్భం. గాన మాధుర్యం అన్నీ కలవాలి. ఆ గీత జాతకం బాగుండాలి.
కల్చరల్ : మీకు నచ్చిన సినీ కవి ఎవరు?
వెన్నెలకంటి : మంచి సాహిత్యం, అంతకుమించిన పదలాలిత్యంతో హృదయాన్ని తట్టిలేపే గుబాళింపుతో పాటలురాసే కవి ఎవరైనా నాకు ఇష్టులే.
కల్చరల్ : సినీ కవిగా శ్రీశ్రీ గురించి చెప్పండి
వెన్నెలకంటి : ఆయనదంతా ఓ యుగం. ప్రభోదాత్మక గీతాలు, విరహగీతాలు, ఒకటేమిటి శ్రీశ్రీ ఏది రాసినా జంఝామారుతమే. అనుకరించ, అనుసరించలేనిది శ్రీశ్రీ బాణి.
కల్చరల్ : మీకు నచ్చిన పాట ఏదీ అంటే అన్నీ నాకు నచ్చినవే అంటారు చాలా మంది. మరి మీరేమంటారు?
వెన్నెలకంటి : నేను సినీ కవిగా నిలబడటానికి వచ్చాను. బ్యాంకు ఉద్యోగిని కావడంతో ఆర్థిక చిక్కులు లేవు. మంచిపాట కావాలి అంటూ నిర్మాతలు వచ్చినప్పుడు వారి తృప్తి మేరకు చాలానే రాశాను. ‘మామయ్య అన్న పిలుపు’ పాట అంటే చాలా ఇష్టం.