ఆకాశం ఇల్లవుతుందా?
పాటతత్వం
మనసు... పాతికేళ్లు పెంచిన ప్రేమను మరచి మూడు పాతికలు కావాల్సిన ప్రేమను వెతుక్కుంటుంది. తాము బతక్కగలమనే నమ్మకం బతుకునిచ్చిన వాళ్లను వదిలేస్తుంది. రెక్కలొచ్చిన పక్షుల్లా బిడ్డలు ఎగిరిపోతే... తెగిన గాలిపటంలా కన్న ప్రేమ కుప్పకూలిపోతుంది. ఆగలేని ఆదుర్దా ఒకరిది... ఆపలేని నిస్సహాయత మరొకరిది... తల్లిదండ్రుల్ని కాదన్నవాళ్లు తల్లిదండ్రులు అయ్యేదాకా... ఈ దుఃఖాన్ని ఊహించలేరు. అప్పుడు గుర్తొస్తుంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ... అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది కాదనీ... లవ్ ఎట్ ఎవ్రీ డే అండ్ నైట్ అనీ...
ఇదే సందర్భం నా ‘బస్‌స్టాప్’ సినిమాలో వచ్చింది. తల్లిదండ్రుల్ని కాదని ఇంట్లోంచి వెళ్లి పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్లు. వాళ్లకో పాప పుట్టాక తప్పు తెలిసి మళ్లీ ఇంటికొచ్చి తల్లిదండ్రులను క్షమించమని అడుగుతారు. వేటూరి గారి దగ్గరికి వెళ్లి పాట నేపథ్యం వినిపించా. ఆయన చివరి రోజుల్లో ఉన్నారు. అయినా ఓపిగ్గా విన్నారు. పాట గురించి వివరించి కిందకి వచ్చా... ఇంతలో ఆయన పాట పూర్తిచేసి వెనక్కి పిలిచారు. ఇంత త్వరగా పాట రాశారా అని ఆశ్చర్యం వేసింది. పాటలు రాయడంలో వేటూరిగారికున్న వేగం నమ్మలేకపోయా. పల్లవి చదువుతుంటే నా ఆలోచన అక్షరాల్లో చూసుకున్నట్లు అనిపించింది.
రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా...
చుక్కలంటిన ఆశా నేలకు ఒరిగిందా...
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమా..
ఇక ఇంటికి రానందమ్మా ఎద రాజీనామా...
కురిసే కన్నీరే వరదయ్యే వేళా...
ప్రేమ గొప్పదే... అంతకన్నా గొప్పది అమ్మా నాన్నల ప్రేమ. అయితే ప్రేమ త్యాగాలు, తల్లిదండ్రుల మనసుకు గాయాలు లేకుండా ప్రేమను సాధించుకోవచ్చు. ఇలాంటి ఆలోచన ఏమాత్రం చేయని చాలా మంది ప్రేమికులు తొందరపాటులో ఇల్లొదిలి వెళ్లిపోవడమే ఏకైక మార్గమనుకుంటారు. రేపటికి పరుగులు పెడుతూ... నిన్నటివరకు కాపాడిన ప్రేమను మరిచిపోతుంటారు... కోరుకున్న వాళ్లు జీవితాంతం తోడుంటారా... అన్నది అనుమానమే. ఈ సందర్భాలనే వేటూరి మొదటి చరణంగా రాశారు...
రేపటికే సాగే పయనం..
నిన్నటినే చూడని నయనం..
గమ్యాలే మారే గమనం ఆగదు ఏ మాత్రం
బతుకంతా ఈడుంటుందా..
చివరంటా తోడుంటుందా..
నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం
ఆకాశం ఇల్లవుతుందా రెక్కలు వచ్చాక..
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక...
కలలే నిజమవునా... కలవరమేమైనా..
ఈ చరణంలో అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక అనేది అద్భుతమైన భావ ప్రదర్శన. జవాబు ఇవ్వాల్సింది అనుమానాలకు తావుండే విషయాలకు మాత్రమే... అమ్మా నాన్నల అనురాగానికి వంక పెట్టగలమా... ఒకవేళ ప్రశ్నిస్తే... దానికి బదులు ఉంటుందా..? చాలామంది యువత తల్లిదండ్రులు ప్రేమను తిరస్కరించగానే... అసలు మీకు నేనంటే ఇష్టం లేదు... నా సంతోషం మీకు అవసరం లేదు అంటూ నిందిస్తారు. అప్పటికి తాత్కాలిక శత్రువులే అవుతారు అమ్మా నాన్న. జీవితంలో ఏదో ఓ సందర్భంలో వాళ్ల ప్రేమ, అనురాగం గుర్తుకు రాకపోవు. దాన్నే వేటూరి పాటలో చెప్పారు. నీవే ఓ అమ్మాయ్యాక... నీ అమ్మే గుర్తొచ్చిందా... అంటూ ఇంటికి తిరిగొచ్చిన హీరోయిన్ గురించి రెండో చరణాన్ని రాశారాయన.
నీవే ఓ అమ్మయ్యాక...
నీ అమ్మే గుర్తొచ్చిందా..
నీ కథ నీకెదురయ్యాక... రగిలిందా గాయం...
పువ్వులనే పెంచే మాలి... ముళ్లల్లో వెతకడు జాలి
తిరిగిందా నిన్నటి గాలి..
ఇంత పొందికైన పదాలతో... భావయుక్తంగా... వేగంగా పాట రాయడం బహుశా వేటూరిగారికే సాధ్యమేమో! సినిమా చివరలో ఇంటికి తిరిగొచ్చిన బిడ్డను అమ్మా నాన్న గుండెలకు హత్తుకుంటారు. ఇళ్లు వదిలినప్పటి నుంచి ఆ అమ్మాయి గుండెల్లో దాచుకున్న బాధంతా వాళ్లతో చెప్పుకుంటుంది. కన్నోళ్లకు ఉన్న క్షమాగుణం మరెవరికి ఉంటుంది. గుండెల్లో ఉన్న ప్రేమ గూటికి చేరిందని... కంటిని వీడిన పాప... కన్నుగా మిగిలిందంటూ... పాటను ముగించారు ఆ సాహితీ మూర్తి..
గుండెను దాగిన ప్రేమా... గూటికి చేరిందా...
కంటిని వీడిన పాపా... కన్నుగ మిగిలిందా...
ఇండస్ట్రీలో ఒక తరహా సినిమాతో విజయం వస్తే... ఇక అలాంటి సినిమాలే చేయమని నిర్మాతలు అడుగుతుంటారు. ‘ఈ రోజుల్లో’ తర్వాత ‘బస్‌స్టాప్’ కూడా అలా వచ్చిన అవకాశమే. అయితే... ఈ సినిమాను మరికొంత పరిపక్వతతో తీయాలని ముందే అనుకున్న.
అందుకే సినిమాలో మూడోభాగం వినోదాత్మకంగా ఉన్నా... చివర్లో మంచి ముగింపు ఇవ్వాలని అనిపించింది. ప్రేమ పేరుతో కన్నవాళ్లను వదిలేసిన పిల్లలు... వాళ్ల విలువ తెలుసుకుని మళ్లీ ఇంటికి చేరే సంఘర్షణను చివర్లో చూపించా. ఈ ఆలోచనకు తన పాటతో గొప్ప రూపమిచ్చారు వేటూరి. అప్పటిదాకా ఉన్న సినిమా నడకను మార్చేసి. ’బస్ స్టాప్’ స్థాయిని పెంచేసిందీ పాట.
సేకరణ: రమేష్ గోపిశెట్టి
- వేటూరి,గేయ రచయిత
మారుతి దర్శకుడు