కడప అర్బన్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరమని కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాష, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. ఆదివారం నగరంలోని తిరుమల హాస్పిటల్స్‌లో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్, తిరుమల హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడతూ కడప నగరంలో ఒకటిన్నర సంవత్సరాల కాలంలో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 మందికి మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడిన వారికి మెకాళ్ల నొప్పులు రావడం సహజమన్నారు. డాక్టర్ సురేంద్రబాబు సారధ్యంలో ఏర్పాటైన తిరుమల హాస్పిటల్స్‌లో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు.
ఈ నెల 26న 210 మందిలో కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకున్న వారిలో 2కే రన్ నిర్వహిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, తిరుమల హాస్పిటల్స్ డాక్టర్ పి.సురేంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో తిరుమల హాస్పిటల్స్ పరిపాలనాధికారి (ఏవో)మారుతితేజ, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు షఫి, కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.