
అరకొర జీతాలతో అవస్థలు
ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్యమిత్రలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఏళ్ల నుంచి పని చేస్తున్నా.. వీరికి తగిన గుర్తింపు లేదు. పేదలకు సంజీవనిలా
తణుకు అర్బన్ :ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్యమిత్రలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఏళ్ల నుంచి పని చేస్తున్నా.. వీరికి తగిన గుర్తింపు లేదు. పేదలకు సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలో రథ సారథులుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల అవస్థలు వర్ణనాతీతం. రోగుల వ్యాధుల స్థితిగతులను ఆరోగ్య ట్రస్టుకు తెలియజేసి.. వాటి మంజూరుతో పాటు చికిత్స చేయించి ఇంటిబాట పట్టే వరకు ఆరోగ్యమిత్రలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుుతే అరకొర జీతాలు, తరచూ బదిలీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాదిమంది పేదలు ప్రాణాల్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె ఆపరేషన్ చేయించుకోలేని ఎంతోమంది రోగులకు అది చేరువైంది. పలు మార్పులు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొన్ని సేవలు కల్పించారు. దీంతో ఆసుపత్రి వైద్యులకు కూడా కేసుకు కొంత మొత్తాన్ని ముట్టచెబుతున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రులకూ, రోగులకూ, వైద్యులకూ ప్రయోజనాలు పెంచుతున్నా విస్తృతంగా సేవలందిస్తున్న ఆరోగ్యమిత్రలను మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు.
నెట్‌వర్క్ ఆరోగ్యమిత్ర, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలుగా సేవలందిస్తున్న మిత్రలకు కనీస వేతనాలు అందడం లేదు. పైగా నెట్‌వర్క్ మిత్రలను 2 నెలల కోసారి ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల వచ్చిన వేతనాలు రవాణా ఖర్చులకే అయిపోతున్నారుు. నెట్‌వర్క్ మిత్రలకు రూ.7,200, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు రూ.4,500 వేతనాలు ఇస్తున్నారు. వీరు పీహెచ్‌సీ విధులతో పాటు రోగుల ఆరోగ్య స్థితి తెలుసుకోవడానికి తరచూ గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగుల వివరాలు నమోదు చేయడం, ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి అనుమతి తీసుకోవడం, రోగులకు వైద్య సేవలు అందుతున్నాయూ.. లేదా పరిశీలించడం, వారికి మందులు, భోజనం సరఫరా తదితర పనులను ఆరోగ్యమిత్రలు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. 2008 నుంచి వీరంతా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కిన నేటి రోజుల్లో రోజు కూలీల కంటే హీనంగా ఇస్తున్న జీతాలతో ఎలా జీవించాలని ఆరోగ్యమిత్రలు ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్య మిత్రల సేవలను క్రమబద్ధీకరించాలని, పే స్కేలు అమలు చేయాలని, వేతనాలను నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారానే చెల్లించాలని, కనీస వేతనం రూ.15 వేలు అందించాలని, నెట్‌వర్క్ మిత్రలకు ఏడాదికి ఒకసారే బదిలీ చేసే విధానాన్ని అమలు చేయాలని, నైట్‌షిఫ్ట్ విధానాన్ని 2 నెలలు కాకుండా పది రోజులకోసారి అమలు చేయాలని కోరుతున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ట్రస్టు ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎటువంటి ప్రయోజనాలు లేకుండా బతుకుతున్నామని వాపోతున్నారు.