ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ కళాశాలల్లో సీట్లుకు, విద్యార్థుల సంఖ్యకూ భారీ వ్యత్యాసం ఉంది. సీట్ల కంటే ఎంసెట్‌లో క్యాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులను చేర్చుకునేందుకు కాలేజీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు భరించలేక ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బావురుమంటున్న దశలో సీట్లు మిగిలిపోతే కళాశాలల నిర్వహణ కష్టమేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫీజు రీయిం బర్‌సమెంట్ పథకంపై నమ్మకం లేకపోవటంతో యాజమాన్యాలు డైలమాలో పడ్డాయి.
ఈ పథకం అమలు చేసినా ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు పెడితే ఆనక విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి వస్తే తమ వల్లకాదంటారనే భయం యాజమాన్యాలకు ఉంది. జిల్లాలో ఎంసెట్-15 రాసిన విద్యార్థుల్లో 8వేల 808 మంది అర్హులు ఉన్నా కాలేజీల్లో ఎంతమంది చేరతారనేది ప్రశ్నార్థకమే. ఈ సంకట స్థితిలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు గాలంవేసే పనిలో నిమగ్నమయ్యాయి.
తగ్గుతున్న కాలేజీలు
జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏడేళ్ల క్రితం జిల్లాలో 32 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండేవి. ఈ ఏడాదికి 25 కళాశాలలే మిగిలాయి. గతంలో లాభసాటిగా ఉన్న కాలేజీల నిర్వహణ, ప్రస్తుతం కొన్ని పేరున్న కాలేజీలకు మినహా మిగిలిన వాటికి భారంగా మారింది. జిల్లాలో కన్వీనర్ కోటాలో 8వేల 841సీట్లు, మేనేజ్‌మెంట్ కోటాలో 3వేల 789 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఒక కాలేజీ మూతపడడంతో ఆ సీట్లు కొద్దిగా తగ్గినా జిల్లాలో 11 వేల సీట్లుకు పైగా ఉన్నాయి. ఎంసెట్‌ను 11,406మంది రాయగా అర్హత సాధించింది 8వేల 808 మంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు తాయిలాలు సైతం ఇచ్చేందుకు పలు కాలేజీలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఫీజులపై ఒత్తిడిలేదు
ఇంజినీరింగ్‌లో పలు బ్రాంచిలకు డిమాండ్ ఉంది. పేరున్న కాలేజీ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే ఉద్యోగం పొందవచ్చని యోచించే విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. గత ఏడాది జిల్లాలోని 9 కాలేజీల్లోనే పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఆరు కాలేజీల్లో అయితే మరీ తక్కువ అడ్మిషన్లు వచ్చాయి. దీంతో ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు ఈసారైనా సీట్లు భర్తీ చేయకుంటే మూసేయటమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫీజు ఎంత కట్టినా ఫరవాలేదు, చేరితే చాలనే యోచనలో కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి. సాంకేతిక విద్యామండలి నిబంధనలు కఠినం కావటంతో నిర్వహణ ఖర్చు భారీగా పెరగనుంది. ఫీజు రీయింబర్‌సమెంట్ పథకంలో సొమ్ములు ఎప్పుడు మంజూరు అవుతాయో తెలియకపోయినా సీట్లు భర్తీ అయితే ముందుకు నడిపించేయాలనే ఉద్దేశంలో యాజమాన్యాలు ఉన్నాయి. ఇది ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు మాత్రం వరమే.
సీట్లోయ్.. సీట్లు
Published Fri, Jun 19 2015 2:08 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement