సీట్లు మురిగిపోవాల్సిందేనా? | number of seats unfilled in government engineering collages | Sakshi
Sakshi News home page

సీట్లు మురిగిపోవాల్సిందేనా?

Published Mon, Aug 17 2015 4:16 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

number of seats unfilled in government engineering collages

- ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్ల భర్తీకి లేని అవకాశం
- వివరాలను ప్రకటించని వర్సిటీలు, కాలేజీలు
 
సాక్షి, హైదరాబాద్:
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించట్లేదు. దీంతో విద్యార్థులకు రావాల్సిన సీట్లు మురిగిపోతున్నాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఏటా ఒక్కో కాలేజీలో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంతో డిమాండ్ ఉండే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఇష్టమైన బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరట్లేదు. ఈసారి కూడా వివిధ కాలేజీల్లో సీట్లు మిగిలిపోయినట్లు సమాచారం.

ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే 20 సీట్లు మిగిలిపోగా మిగిలిన 16 కాలేజీల్లోనూ సీట్లు మిగిలినట్లు తెలియవచ్చింది. కానీ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయన్న వివరాలను వర్సిటీలు, కాలేజీలు ప్రకటించట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలలో సీట్లు మిగిలిపోతే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్వహిస్తోంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించింది. నాలుగో దశ ముగిశాక కూడా దాదాపు 3,500 సీట్లు మిగిలిపోవడంతో మరోసారి స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. 18న సీట్ల కేటాయింపు ప్రకటిస్తామని, 18 నుంచి 26 వరకు విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీల్లో చేరాలని సూచించింది.

అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్లలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మిగులు సీట్లను ప్రకటించి వాటిని భర్తీ చేయాలని కోరుతున్నారు. మిగులు సీట్ల విషయంపై అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ కాలేజీల్లో చివరి దశ కౌన్సెలింగ్ తరువాత విద్యార్థులు చేరని సీట్లను భర్తీ చేసే అవకాశం లేదని చె ప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement