వైద్యవిధాన పరిషత్‌లో పైరవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విధానపరిషత్ కమిషనర్ పోస్టుకోసం పోటాపోటీగా యత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 212 ప్రభుత్వ ఆస్పత్రులకు అధిపతి, కమిషనరే కావడంతో ఈ పదవికోసం ఐదారుగురు వైద్యులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. సీనియారిటీలు, పదోన్నతుల ప్రాతిపదిక నియామకం అనే ప్రాథమిక సూత్రాలు పనిచేయకపోవడంతో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి లేదా ముఖ్య కార్యదర్శికి నచ్చిన వాళ్లే కమిషనర్లు అవుతున్నారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 31తో పదవీ విరమణ చేసేలోగానే ఇన్‌చార్జిగా కమిషనర్‌ను నియమించాల్సి ఉంది. వైద్య విధానపరిషత్‌లోని విజిలెన్స్ అధికారి డాక్టర్ కనకదుర్గతో పాటు, కార్యదర్శి గోపీకృష్ణలు ప్రస్తుతం ఈ పోస్టుకు పోటీపడుతున్నారు. కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్ జయకుమారి, ఏపీశాక్స్‌లో జేడీగా ఉన్న జయచంద్రారెడ్డి కూడా రేసులో ఉన్నారు. అయితే, హెచ్‌ఐవీ కిట్ల కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డిపై ఇటీవలే అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి, ఆయనకు కమిషనర్ పోస్టు దక్కకపోవచ్చని ఓ అధికారి అన్నారు. మరో ఇద్దరు కూడా కమిషనర్ పదవికి పోటీలో ఉన్నట్టు తెలిసింది.
ఆశావహులంతా, వారం రోజులుగా అటు ముఖ్యమంత్రి చుట్టూ, ఇటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. తమకు నచ్చిన అధికారి కమిషనర్‌గా వస్తే బావుంటుందనే ఆశతో ఆస్పత్రుల నిర్వహణను చూసే కాంట్రాక్టర్లూ రంగంలోకి దిగారు. కమిషనర్ పోస్టుతోపాటు పరిషత్ కార్యదర్శిని నియమించేందుకు, పదోన్నతుల కమిటీ (డీపీసీ)ని శనివారం ఏర్పాటు చేశారు. నచ్చిన ఓ అధికారిని కార్యదర్శిగా నియమించడానికి రంగం సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై సీఎం పేషీనుంచి ఒత్తిళ్లు రావడంతో ముఖ్య కార్యదర్శి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది!
కమిషనర్ పోస్టుకు పోటాపోటీ
Published Sun, Dec 29 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement