కేసముద్రం న్యూస్‌లైన్ : ఈ రైతు దున్నుతున్నది పంటను సాగుచేసేందుకు కాదు.. సాగుచేసిన పంటనే దున్నుతున్నారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లి తండాకు చెందిన మాలోతు బాలు రెండెకరాల్లో యాభైవేల రూపాయలు పెట్టుబడి పత్తిపంట సాగుచేశాడు. కుటుంబమంతా కష్టపడి సాగుచేసిన పంట వర్షార్పణం కావడంతో ఆవేదనకు లోనయ్యాడు. వానతో మొలకెత్తిన పత్తి కాయలను చూడలేకపోయాడు. పగిలిన పత్తికాయలతో కళకళలాడిన పంట పూతరాలిపోయి, కాయంతా కుళ్లిపోయి మోడువారినట్టు ఉండడంతో తట్టుకోలేకపోయాడు. బుధవారం.. చేనునంతా దున్ని నేలపాలు చేశాడు. ఇంత పెట్టుబడి పెట్టి, ఎండనక, వాననకా కష్టపడి సాగుచేస్తే మిగిలింది ఇదేనని వాపోయాడు.