విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 78 శా తం ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఈ ఎన్నికల్లో ఈవీ ఎంలలో సాంకేతిక లోపాలు ఏర్పడిన ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల పోలింగ్ ఉదయం ఏడు గంట లకే ప్రారంభమయింది. ఉదయం కొద్ది సేపు మందకొడిగా సాగి, 9 గంటల నుంచి పుంజు కుంది. 2,083 పోలింగ్ కేంద్రాలు, మరో రెండు ఉప కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే వాతావరణం అనుకూలించి, ఎండ తగ్గడంతో ఎక్కడా ఓటర్లు ఇబ్బందులకు గురికాలేదు.
ఓట్ల గల్లంతు మామూలే..
గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతై చాలా ఇబ్బందికి గురైనప్పటికీ యంత్రాంగం తీరులో మార్పు రాలేదు. ఈసారి కూడా చాలా మంది తమ ఓటు లేకపోవడంతో వెనుతిరగవలసి వచ్చింది. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసిన సమయంలో ఆ ప్రాంతాల్లో లేని వారు, పట్టణాల్లోని ఇళ్లు మారిన వారు ఓట్లు లేక నిరాశకు గురయ్యారు.
ఏప్రిల్ 19 వరకూ ఈసీ అవకాశం ఇచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల నమోదు కార్యక్రమం సవ్యంగా జరుగలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఇప్పుడూ కూడా తమకు ఓటు హక్కు కల్పించలేదని విజయనగరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భోగి జ్యోతి, సత్యవతి అనే ఇద్దరు మహిళలు వాపోయారు. తాము అర్జీలు పెట్టుకుని అధికారులకు చెప్పినప్పటికీ ఓటు హక్కు కల్పించలేదని, చాలా ఏళ్లుగా విజయనగరంలో ఉంటున్నప్పటికీ ఓటు హక్కు కల్పించకపోవడం దారుణమని వాపోయారు. అలాగే ఓట్లు, ఓటరు స్లిప్పులు లేని చాలా మంది కలెక్టరేట్‌లోని ఎలక్షన్ సెల్‌కు వచ్చి తమ ఓటు గూర్చి వాకబు చేశారు.
ఊపిరిపీల్చుకున్న అధికారులు..
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. దాదాపు మూడు నెలలుగా ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. పోలింగ్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకపోవడంతో వారు తమ శ్రమను మరిచిపోయి ఆనందం వ్యక్తం చేశారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
పోలింగ్ సరళిని కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. విజయనగరం పట్టణంలో మహారాజా సంగీత కళాశాల, ఎమ్మార్ కాలేజ్, గొట్లాం లోని పోలింగ్ కేంద్రాలను వారు సందర్శించారు. గొట్లాం, సంగీత కాలేజీల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా పరిశీలించారు. వీరితో మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ తదితరులున్నారు.
కాగా గుర్ల మండలం మీసాలపేటలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ పూర్తయింది.
తమ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో కొత్తవలస పంచాయతీ పరిధిలోని దిగువఎర్రవానిపాలెం గ్రామానికి చెందిన ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటింగ్‌ను బహిష్కరించారు.
ఓటెత్తారు
Published Thu, May 8 2014 2:06 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement