విజయనగరం అర్బన్ /రూరల్/ మున్సిపాలిటీ/టౌన్/కొత్తపేట, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 225 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 72 శాతం పోలింగ్ నమోదైంది.
ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నియోజకవర్గంలోని విజయనరగం మున్సిపాలిటీ, మండలంలోని 15 పంచాయతీలలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరడంతో 9 గంటల వరకు 17 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45 శాతం, 3 గంట లకు 57 శాతానికి చేరుకుంది. ఎండకారణంగా మధ్యాహ్నం సమయంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు రాకపోవడంతో పోలింగ్ మందకొడిగా సాగింది. తిరిగి 5 నుంచి 6 గంటల మధ్యలో పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొరాయించిన ఈవీఎంలు
పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ సిబ్బందికి ఈవీఎం ఆపరేటింగ్‌పై అవగాహన లేకపోవడంతోనే సమస్య ఏర్పడినట్లు చెబుతున్నారు. పట్టణంలోని వీటీఅగ్రహారం జిల్లా పరిశ్రమ శాఖ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో సాంకేతిక సిబ్బంది వెంటనే వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు
పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. దాసన్నపేట పోలింగ్ కేంద్రంలో గాదె శ్రీనివాసులునాయుడు ఓటు వేశారు. వైఎస్‌ఆర్ సీపీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హెల్ప్‘లెస్’ కేంద్రాలు
ఓటర్లకు ఎలాంటి సందేహం వచ్చిన తక్షణమే నివృత్తి చేయాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల ఆవరణలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పట్టణంలో 195 పోలింగ్ కేంద్రాల వద్ద వీటిని ఏర్పాటు చేసినా ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. దాసన్నపేట పోలింగ్ బూత్ సమీపంలోని హెల్ప్‌డెస్క్‌లో సమాచారం ఇవ్వలేదని స్థానికులు వాపోయారు. ఈ మేరకు దాసన్నపేట ఉడాకాలనీకి చెందిన ఓటర్లు కళ్యాణ్, సాయి మున్సిపల్ కమిషనర్‌కి ఫిర్యాదు ఇచ్చారు.
రూరల్ పరిధిలో...
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని 225 పోలింగ్ బూత్‌లలో ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎన్నిక ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండే ప్రారంభం కావడంతో ఓటర్లు ప్రారంభం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాజకీయ పక్షాల నాయకులు ఓటర్లను ఆటోలు, రిక్షాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు.
అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. ద్వారపూడి గ్రామంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏజెంట్లు సైతం బయటకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారు. గుంకలాం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయగా అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు. దీంతో వైసీపీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో డీఎస్పీ శ్రీనివాసరావు గుంకలాం చేరుకుని ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
మండలంలోని బియ్యాలపేట, మలిచర్ల గ్రామాల్లో సాయంత్రం ఆరుగంటలు దాటిన తర్వాత ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. బియ్యాలపేట గ్రామంలో ఒకే పోలింగ్ స్టేషను కావడంతో పాటు అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. విజయనగరం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పట్టణ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపాటు నారాయణపురం, దుప్పాడ, జొన్నవలస తదితర గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టణంలోని 143వ నంబర్ పోలింగ్ స్టేషన్‌లో తన సతీమణి ఎంపీ అభ్యర్తి ఝాన్సీలక్ష్మితో పాటు తల్లి, కుమారుడు, కుమార్తె ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడ్ల రమణమూర్తి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. టీడీపీ పార్లమెంటు అభ్యర్థి అశోక్‌గజపతిరాజు కొండకరకాం, నారాయణపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ నాయకులు గురాన అయ్యలు, అవనాపు విక్రమ్, అవనాపు చిన్నమ్మలు కూడా ఓటు వేశారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత తన ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. మయూరి జంక్షన్ వద్ద మున్సిపల్ పాఠశాలలో ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సతీసమేతంగా ఓటు వేశారు. సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్, వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూ నియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేంద్ర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70 అతి సమస్యాత్మక, 76 సమస్యాత్మక, 79 సాధారణ కేంద్రాలను గుర్తించిన అధికారులు 177 చోట్ల వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బంది పోలింగ్ విధులను నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల సమయం ముగియడంతో పోలింగ్ అధికారులు ఈవీఎంలకు సీల్ వేసి జేఎన్‌టీయూ క్యాంపస్‌కు తరలించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఎండ ప్రభావం ఓటర్లపై పడకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తాగునీటిని అందుబాటులో ఉంచారు. పట్టణంలోని 23వ వార్డు బాలాజీనగర్, తోటపాలెం, ముచ్చెవాని చెరువు గట్టు, నాగోజీపేట తదితర ప్రాంతాల్లో ఓటర్లు అయోమయం చెందారు.
వార్డుల విభజన కారణంగా ఓటు ఎక్కడ వచ్చిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. మంగళవీధి మున్సిపల్ హైస్కూల్, కంటోన్మెంట్ గూడ్స్‌షెడ్, మున్సిపల్ హైస్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్ తదితర ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ గా ఓటు వేసేందుకు ముందుకువచ్చారు.
బారులు తీరిన ఓటర్లు
కొత్తపేట పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఆశపువీధి, పుత్సలవీధి, గొల్లవీధి, సంతపేటలలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేక కొందరు నిరాశతో వెనుదిరిగారు.
వెలవెలబోయిన రోడ్లు
నిత్యం జనాలతో కిటకిటలాడే పట్టణ రహదారులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బుధవారం వెలవెలబోయాయి. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో ఏ ఒక్క దుకాణమూ తెరుచుకోలేదు. చివరికి టీ షాపులు కూడా తెరవలేదు. 144 సెక్షన్‌ను పక్కగా అమలు చేయటంతో ఓటు హక్కును వినియోగించుకున్న వారు రోడ్లపైకి రాలేదు. దీనికితోడు విపరీతంగా ఎండ కాయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.