ఊరెళ్తున్న నగరం | Heavy rush at Hyderabad's bus, railway stations | Sakshi
Sakshi News home page

ఊరెళ్తున్న నగరం

Published Wed, Oct 17 2018 11:53 AM | Last Updated on Tue, Oct 30 2018 2:05 PM

Heavy rush at Hyderabad's bus, railway stations - Sakshi

విశాఖసిటీ: సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరొందిన వైజాగ్‌ నగరం.. పల్లెకు పరుగులెడుతోంది. సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యమిచ్చే దసరా పండగ సందర్భంగా సొంతూళ్లలో సరదాగా గడిపేందుకు పయనమవుతున్నారు. విశాఖకు వచ్చే వారికంటే నగరం నుంచి గ్రామాలకు వెళ్లేవారే అధికంగా ఉండటంతో ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వచ్చి నివాసముంటున్నారు. పండగ సెలవులు రావడంతో పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరం నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేసినా...
దసరా సందర్భంగా ఆర్టీసీ, రైల్వే అధికారులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. దసరా సెలవులకు నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ బస్సులకు ఎక్కువ డిమాండ్‌ ఉండటంతో ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత సంవత్పరంలో ఉన్న పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది విశాఖ రీజియన్‌ నుంచి 416 అదనపు బస్సులు నడపగా.. ఈ ఏడాది విశాఖ రీజియన్‌ నుంచి రెగ్యులర్‌గా తిరిగే బస్సులతో పాటు అదనంగా 500 బస్సులతో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం మొదలగు దూరప్రాంత బస్సులతో పాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాలైన నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. ఇదే మాదిరిగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే కూడా ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేకరైళ్లు నడుపుతోంది. ఇటీవల తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు ఒడిషా రాష్ట్రంలోనూ రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో.. వాటిని పునరుద్ధరించేందుకు సమయం పట్టింది. దీంతో చాలా మంది బస్సులను ఆశ్రయించారు. అయినప్పటికీ దసరాకు ముందు మూడు రోజుల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓవైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండటంతో రైళ్లు బస్సులు ఖాళీ ఉండటం లేదు. ముఖ్యంగా రైళ్లలోని జనరల్‌ బోగీల్లో అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉండటంతో ఫైన్లు కట్టి మరీ రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణాలు చేస్తున్నారంటే డిమాండ్‌ ఎంతలా ఉందో అర్థమవుతోంది.

ప్రైవేట్‌ బాదుడు
ఇదిలా ఉండగా.. ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఎలాగైనా దసరా పండగను ఊరిలో చేసుకోవాలనే ప్రజల తాపత్రయాన్ని, సెంటిమెంట్‌ను ప్రైవేటు బస్సులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే శాఖ బస్సులు ఏర్పాటు చేసినా.. డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో.. చాలా మంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఉదాహారణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ.700 నుంచి రూ.900 వరకూ ఏసీ సర్వీసులకు టికెట్‌ వసూలు చేసిన ప్రైవేటు బస్సులు.. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రూ.1800 నుంచి రూ.2000 వరకూ వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు సైతం.. రెట్టింపు భారాన్ని మోస్తూ.. ఉసూరంటూ ఊళ్లకు వెళ్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement