ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బాబుగారూ..
కడప అగ్రికల్చర్ :‘ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బాబుగారూ.. తొలి సంతకం రుణమాఫీపైనే అని ప్రగల్భాలు పలికినా సీఎంగారూ.. ఆ సంతకం ఏమైంది’ అంటూ ఏపీ మహిళా సమాఖ్య సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. బుధవారం కడప కలెక్టరేట్ వద్ద ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు మౌనదీక్ష నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బషీరున్నీషా, కార్యదర్శి విజయలక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణమాఫీపై మాట తప్పారని ఘాటుగా విమర్శించారు.
డ్వాక్రా మహిళలతో కలిసి ఉద్యమాలు చేయగా ఆఘమేఘాలపై గ్రూపునకు రూ 10 వేలు రుణమాఫీ అని ప్రకటించారన్నారు. దీనికి కూడా సవాలక్ష లింకులు పెట్టి, మెలికలు పెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అవుతుందన్న ఆశతో అక్కచెల్లెళ్లు బ్యాంకులకు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఆ బకాయి తడిసి మోపెడైందని, ఇప్పుడు ఆయా రుణాలు చెల్లించలేక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావని ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య నాయకురాళ్లు ఆచారమ్మ, క్రిష్ణవేణి, సుభాషిణి, సుబ్బలక్షుమ్మ, ప్రమీల, మున్నీ, నారాయణమ్మ, సుగుణమ్మ పాల్గొన్నారు.