సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాయకుల పరామర్శలు, పర్యటనలు తుపాను పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. నేతల చుట్టూ తిరగడంతోనే అధికారుల పుణ్యకాలం కాస్తా కరిగిపోతోంది. రోజంతా నాయకుల సేవలోనే వారు గడుపుతుండడంతో తుపాను పనులను ఆటంకం కలుగుతోంది. దీంతో తుపాను వెళ్లి నాలుగు రోజులు గడిచినా పునరుద్ధరణ, పునరావాస కార్యక్రమాలు ఊపందుకోవడం లేదు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రుల వరకు జిల్లాకొస్తుండడం వల్ల మేలు జరుగుతుందనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటనే దీనికి ఉదాహరణ. ఈ నెల 13న భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పర్యటిస్తారని షెడ్యూల్ ఇచ్చారు. దీంతో అధికారులు ఆయన పర్యటన కోసం నానా హైరానా పడ్డారు. సీఎం పర్యటనా ప్రశాం తంగా సాగిపోవాలని అధికారులంతా ఆయా మండలాల్లో మకాంపెట్టి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తీరా అంతా సిద్ధం చేసిన సీఎం తన పర్యటనను రద్దు చేశారు. ఇక మరుసటి రోజైన 14వ తేదీన(మంగళవారం) జరుగుతుందని ప్రకటించారు. దీంతో అధికారులు మళ్లీ హడావుడి చేశారు. జిల్లా అధికారులతో పాటు పోలీసులంతా సీఎం పర్యటనా ప్రాంతాల్లోనే ఉండిపోయారు. తీరా ఏర్పాట్లన్నీ అయ్యాక సీఎం పర్యటన రద్దయ్యిందని ప్రకటించారు. దీంతో అధికారులందరికీ ఆ రోజు వృథా అయ్యింది. ఫలితంగా ఆ రెండు రోజులు అధికారులు పునరుద్ధరణ, పునరావాస కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇక ముచ్చటగా మూడోసారి సీఎం పర్యటనా షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు భోగాపురం మండలం దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో పర్యటిస్తారని షెడ్యూల్ ఇచ్చారు. అయితే, ఆ సమయానికి రాలేదు. మధ్యాహ్నం 2.26 నిమిషాలకు దిబ్బలపాలెం వచ్చి పది నిమిషాలు పాటు గ్రామ గట్టున నిలబడి బాధితులకు కాసింత భరోసా ఇచ్చే మాటలు చెప్పి మమ అన్పించేవారు.
ఆ తర్వాత ముక్కాం గ్రామానికెళ్లి మత్స్యకారులను పలకరించారు. అక్కడ కాసేపు మాట్లాడి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇలా మూడు రోజుల పాటు సీఎం పర్యటనా బిజీలో పడి అధికారులు పునరుద్ధరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక మంత్రులు అశోక్ గజపతిరాజు, పల్లె రఘునాథరెడ్డి, చిన రాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు జిల్లాలో మకాం వేశారు. వాళ్లు రావడం మంచిదే గాని వారి చుట్టూ తిరిగి అధికారులు సమయాన్ని వృథా చేసుకుంటున్న పరిస్థితి నెలకుంది. సమీక్షల పేరుతో అధికారులు దగ్గర్నే ఉంచుకోవడం, వారి సేవల కింద కొంతమంది అధికారులు నిమగ్నమవ్వడంతో పునరుద్ధరణకు సిబ్బంది సరిపోలేని పరిస్థితి నెలకొంది. ఇక, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారుల వల్ల అదే రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తానికి పునరుద్ధరణ పనులు ఊపందుకోవడం లేదు. ప్రజల కష్టాలు తీరడం లేదు.
పర్యటనలకే ప్రాధాన్యం అందని సహాయం
Published Thu, Oct 16 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
Advertisement