లిబర్టీ వద్ద హీరో శివాజీ ఆందోళన
హైదరాబాద్ : శ్రీవారి భక్తులపై కేసులు ఎత్తివేయాలంటూ హీరో శివాజీ గురువారం ఆందోళనకు దిగారు. లిబర్టీలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీలకు రెడ్ కార్పెట్ పరిచిన టీటీడీ...సామాన్య భక్తులపై కేసులు పెట్టడం అనైతికమని మండిపడ్డారు. తిరుమలలో ఎమర్జెన్సీని తలపించేలా టీటీడీ వ్యవహరిస్తోందని శివాజీ ధ్వజమెత్తారు. టీటీడీ ఈవో, ఛైర్మన్లపై కేసులు నమోదు చేసి.... సామాన్య భక్తులపై కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేంకటేశ్వర స్వామి దర్శనం ఆలస్యమవుతోందని, గదులు లభించలేదని ఆందోళన చేసిన శ్రీవారి భక్తులపై పోలీసు కేసులు నమోదు చేశారు. తమ సమస్యలు వెలిబుచ్చిన భక్తులపై కేసులు నమోదు చేయటం తిరుమల చరిత్రలోనే ఇది మొదటిసారి. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రోడ్లపైన, టీటీడీ చైర్మన్ బాపిరాజు కార్యాలయం వద్ద బైఠాయించిన భక్తులపై కేసులు నమోదు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.