Hero Shivaji
-
‘టీడీపీకి దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోండి!’
సాక్షి, కర్నూలు : సినీనటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ రాజకీయ దళారి.. టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్ బ్రోకర్ అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ బీజేపీలో కలిసేందుకే టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. 6వ విడత జన్మభూమి పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వేల సంఖ్యలో ప్రజల అర్జీలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అగ్రిగోల్డ్ కుంభకోణం ఏపీలో జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ నెల 18న అమిత్‌షా రాయలసీమలో అడుగు పెడుతున్నారని, టీడీపీ వాళ్లకు దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోమనండి అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే టీడీపీ.. సీబీఐని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. -
‘శ్రీనివాసరావ్‌ని చంపి కేసు క్లోజ్ చేసేందుకు కుట్ర’
సాక్షి, అనంతపురం : శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్లోనే నిందుతుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఏపీకి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ : నటుడు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అని సినీ హీరో శివాజీ విమర్శించారు. గురువారం గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో శివాజీ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అలాగే మనకంటే ముందు 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాడాలని, ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలాడుతున్నారని.. పార్లమెంటు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టి వెంక య్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయుడికి కోపం వస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని శివాజీ అన్నారు. -
పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు:శివాజీ
ప్రస్తుత సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి,నరేంద్ర మోడీ సేవలు దేశానికి అత్యంత అవసరం అని ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో శివాజీ ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీలో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు గొడవలు లేవన్నారు. తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రావడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సామాన్య రైతు కుటుంబం నుంచి తాను వచ్చానని చెప్పారు. తనకు ఇంత గుర్తింపు వచ్చిందంటే అది తెలుగు ప్రజల వల్లే అని ఆయన పేర్కొన్నారు. గతంలో వరదల సమయంలో తన వంతుగా విరాళాలు సేకరించి ఇచ్చానని ఈ సందర్బంగా శివాజీ గుర్తు చేశారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు సురేష్ బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
లిబర్టీ వద్ద హీరో శివాజీ ఆందోళన
హైదరాబాద్ : శ్రీవారి భక్తులపై కేసులు ఎత్తివేయాలంటూ హీరో శివాజీ గురువారం ఆందోళనకు దిగారు. లిబర్టీలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీలకు రెడ్ కార్పెట్ పరిచిన టీటీడీ...సామాన్య భక్తులపై కేసులు పెట్టడం అనైతికమని మండిపడ్డారు. తిరుమలలో ఎమర్జెన్సీని తలపించేలా టీటీడీ వ్యవహరిస్తోందని శివాజీ ధ్వజమెత్తారు. టీటీడీ ఈవో, ఛైర్మన్లపై కేసులు నమోదు చేసి.... సామాన్య భక్తులపై కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేంకటేశ్వర స్వామి దర్శనం ఆలస్యమవుతోందని, గదులు లభించలేదని ఆందోళన చేసిన శ్రీవారి భక్తులపై పోలీసు కేసులు నమోదు చేశారు. తమ సమస్యలు వెలిబుచ్చిన భక్తులపై కేసులు నమోదు చేయటం తిరుమల చరిత్రలోనే ఇది మొదటిసారి. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రోడ్లపైన, టీటీడీ చైర్మన్ బాపిరాజు కార్యాలయం వద్ద బైఠాయించిన భక్తులపై కేసులు నమోదు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.