సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు వీలుగా హైటెక్ ఫీచర్లతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఓ క్లిక్ ఇస్తే సరి.. ఆఫీస్‌లోని మెయిన్ స్విచ్ ఆగిపోతుంది. మళ్లీ మీరు ఆన్ చేసే వరకూ ఏ లైటూ వెలగదు. ఈ తరహా టెక్నాలజీని ఏపీ విద్యుత్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మూడేళ్లలో వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
హైటెక్ స్మార్ట్ మీటర్ పనితీరు ఇలా..
- స్మార్ట్ మీటర్‌లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు. మీ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌కు చిప్ సిగ్నల్స్ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే రిమోట్‌లా పనిచేస్తుంది.
- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పనిచేసే చిప్‌కు ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఇంటర్నెట్ అవసరం లేదు. మీ మొబైల్‌లో నెట్ సౌకర్యం ఉంటే చాలు.
- మొబైల్ యాప్ ఓపెన్ చెయ్యగానే స్మార్ట్ మీటర్ దగ్గర చిప్ ఆఫీస్‌లో కరెంట్ పరిస్థితిని తెలియజేస్తుంది. విద్యుత్ ఉందా? లేదా? అనే విషయం ఇట్టే
తెలుసుకోవచ్చు.
- ఆఫీస్‌లో ఎంత లోడ్ ఉందో చిప్ సమాచారమిస్తుంది. లోడ్‌ను బట్టి ఏయే ఉపకరణాలు ఆన్‌లో ఉన్నాయనే విషయాలు గమనించవచ్చు.
- అనవసరంగా ఉపకరణాలు వెలుగుతుంటే మొబైల్ యాప్‌లో ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే మెయిన్ ద్వారా విద్యుత్ ఆగిపోతుంది.
ఎప్పటి నుంచి... ?
- హైటెక్ స్మార్ట్ మీటర్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచే వీలుందని అధికారులు చెప్పారు.
- ఒక్కో మీటర్ రూ. 4 నుంచి రూ. 7 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- అతి తక్కువ ధరకు అమర్చే సంస్థనే ఎంపిక చేయాలనే లక్ష్యంతో విద్యుత్ సంస్థలున్నాయి.
- ప్రక్రియ పూర్తయి, మీటర్ల తయారీ జరిగితే మే నాటికి ప్రభుత్వ కార్యాలయాలకు, వచ్చే మూడేళ్లలో వినియోగదారులకూ హైటెక్ స్మార్ట్ మీటర్లు బిగించే వీలుంది.
ఇంకా ఉపయోగాలేంటి
- టైమర్ సౌకర్యం కూడా స్మార్ట్ మీటర్‌లో ఉంటుంది. అంటే ఎప్పుడు లైట్లు ఆగిపోవాలో యాప్ ద్వారా టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది.
- ఏ రోజున ఎంత విద్యుత్ వాడుకోవాలనే విషయం ఇక మన చేతుల్లోనే ఉంటుంది. యాప్‌లో ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే వాడకం పరిమితి తర్వాత విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల అధిక బిల్లులను నియంత్రించే వీలుంది.
- నెలకు ఎంత బిల్లు వస్తుందనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నెలవారీ బిల్లును కూడా యాప్ ద్వారానే ఆటోమేటిక్‌గా చెల్లించుకునే వీలుంది. బ్యాంక్, పేటీఎం, ఇతర యాప్‌లకు లింక్ అయితే
సరిపోతుంది.
- కరెంట్ హెచ్చు తగ్గుల వివరాలూ స్మార్ట్ మీటర్ ద్వారా రికార్డవుతాయి. నాణ్యమైన విద్యుత్ అందనప్పుడు, అంతరాయాల వల్ల ఉపకరణాలు దెబ్బతిన్నప్పుడు పంపిణీ సంస్థను ప్రశ్నించేందుకు కచ్చితమైన
ఆధారాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment