ఓయూ ఉద్రిక్తం
ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్:
ఓయూ రెండోరోజు మంగళవారం కూడా ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ర్యాలీలు, పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగంతో రణరంగాన్ని తలపించింది. ఈఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ జే ఏసీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చించాలని తెలంగాణ,ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి అసెంబ్లీ వరకు భారీర్యాలీ చేపట్టారు. ఓయూ ప్రవేశద్వారం ఎన్‌సీసీ వద్ద వీరి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు,పోలీసులకు వాగ్వాదం,తోపులాట జరిగింది. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వారిపై రాళ్లవర్షం కురించారు.
విద్యార్థుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు పలుమార్లు బాష్పవాయువుగోళాలను ప్రయోగించడంతో ఆంధ్రమహిళా సభ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న శంషాబాద్‌కు చెందిన ఇంద్రాక్షి అనే విద్యార్థిని కంటికి గాయమైంది. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే ఓయూ లాకాలేజీ విద్యార్థి అరవింద్ మోకాలికి తీవ్రగాయాల్యాయి. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులు బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు క్యాంపస్ పరిసరాల్లో భారీగా మోహరించారు.