
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
నెల్లూరు: సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ , తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి... అక్కడ పని చేస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.