
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్యశాఖలో భారీ అవినీతి జరిగిందంటూ ఇందుకూరి వెంకట రామరాజు వేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో వాదనలు నడిచాయి. దాదాపు 230 కోట్ల రూపాయల మేరకు వైద్య పరికరాలు, సేవల నిర్వహణలో అవినీతి జరిగిందని 2018 జూలై 26న హైకోర్ట్‌లో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపించాలని గతంలో ఎసీబీని న్యాయస్థానం ఆదేశించింది. ఎసీబీ విచారణ జరిపి, నివేదిక కోర్టుకు సమర్పించే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్నారు. 2018 జూలై 26 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఏసీబీ విచారణ చేయరాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో గెజిట్ నోటిఫికేషన్‌పై వచ్చే నెల 14న వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. అలాగే పిటిషనర్ ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అధిక మొత్తాలకు టెండర్లు ఇచ్చిన సంస్థ నుంచి 24 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అంగీకరించింది.