
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార టీడీపీకోసం పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కారణాలు ఏవీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాకపోవడంతో ఏ కారణాలతో ప్రభుత్వ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసిందో తెలియరాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును, కడప, శ్రీకాకుళం ఎస్పీలను తప్పిస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది.
ఈ అనుబంధ పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులే ఎన్నికల పరిధిలోకి వస్తారని, ఇదే విషయాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28(ఏ) చెబుతోందన్నారు. అందువల్ల ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని వివరించారు. ఈ వాదనను ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి తోసిపుచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఇంటెలిజెన్స్ విభాగానిది కీలక పాత్ర అని, ఈ విభాగం లేకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.
డీజీపీ కూడా ఎన్నికల విధుల్లో భాగమని, ఆయన కింద పనిచేసే ఇంటెలిజెన్స్ డీజీ కూడా విధుల్లో భాగంగానే ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని, ఇందుకు కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈసీ ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలన్న ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించట్లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధాన పిటిషన్‌లో విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment