విశాఖ కేజీహెచ్‌లో కోలుకున్న అనంతరం ఆడుకుంటున్న చిన్నారులు
విశాఖలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ సీఎం సూచన మేరకు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులందరూ అక్కడే ఉన్నారు. స్వయంగా అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితుల్లో కొండంత ధైర్యం నింపుతున్నారు. వివిధ కమిటీల ద్వారా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ శనివారం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడంలో భాగంగా ఈ బృందం ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో అణువణువూ పరిశీలించింది. గాలిలో స్టైరీన్ మోనోమర్ శాతం కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో 1.9 పీపీఎంగా నమోదవుతోంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు కరికాల వలవన్ తెలిపారు. గంటగంటకూ రీడింగ్ నమోదు చేసి, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు గుర్తిస్తున్నామన్నారు.
పశువులకూ వైద్యం
► సీఎం ఆదేశాల మేరకు ప్రమాద ప్రాంతంలో పశువులకూ వైద్యం కొనసాగుతోంది. పలు గ్రామాల్లో పశువులకు సెలైన్ ఎక్కిస్తున్నారు. 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయి.
► బాధిత గ్రామాల్లో వైద్య సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. మృతుల బంధువులను వారు పరామర్శించారు.
► ఎల్‌జీ పాలిమర్ ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లోని ప్రజల భద్రత తమ బాధ్యత అని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా కల్పించారు. శనివారం ఆయన ప్లాంట్‌ను సందర్శించారు.
ఇప్పుడే కంపెనీని తెరవం
► ఎల్‌జీ పాలిమర్స్‌లో పరిస్థితులపై వివిధ కమిటీల అధ్యయనం తర్వాత ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరిచే ప్రసక్తే లేదని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం సీఎం ప్రకటించారన్నారు. లీగల్ హెయిర్ రిపోర్టు ఆదివారం తెప్పిస్తారని చెప్పారు.
► విశాఖ జిల్లాలో ఉన్న అన్ని రసాయనిక కర్మాగారాల పరిస్థితిని నిపుణుల బృందంతో తనిఖీ చేయిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లను వాడవద్దని నిపుణులు చెప్పారని, బోర్‌వెల్స్‌నూ పరిశీలిస్తారన్నారు.
► బాధితులకు సత్వర వైద్యం, పరిహారం, వసతి, నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా వ్యవహరిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని మూడు రోజులుగా విశాఖలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.
► గ్యాస్ ప్రభావం అత్యల్ప స్థాయికి తీసుకొస్తున్న తీరుతెన్నులు, బాధిత ప్రజలకు అందుతున్న వైద్యం, షెల్టర్లలో సౌకర్యాలపై మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించారు.
వేగంగా కోలుకుంటున్న బాధితులు
► గ్యాస్ లీకేజీతో తీవ్రంగా, స్వల్పంగా అస్వస్థతకు గురైన 585 మంది కేజీహెచ్‌తో పాటు విశాఖ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే.
► కేజీహెచ్‌లో చేరిన 418 మందిలో 111 మంది పూర్తిగా కోలుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. మిగతా 307 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన 167 మందిలో 62 మంది డిశ్చార్జి అయ్యారు.
పరిహారం అందజేతకు ఏర్పాట్లు
ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ పరిహారాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందించేందుకు అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నారు. ఆదివారం ఈ ప్రక్రియ కొలిక్కిరానుంది.
గ్యాస్ ప్రభావంపై అధ్యయనానికి కమిటీలు
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గురువారం లీకైన స్టైరీన్ గ్యాస్ ప్రభావంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణుల కమిటీలు రంగంలోకి దిగాయి. విష వాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కమిటీలు ప్రభుత్వానికి అవసరమైన సూచనలిస్తాయి. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీలోని ఇద్దరు సభ్యులు శనివారం విశాఖకు వచ్చారు. ముంబైలోని సుప్రీం పెట్రోకెమికల్స్ సంస్థ నుంచి ప్రముఖ స్టైరీన్ నిపుణుడు శంతను గీటె, ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) డైరెక్టర్ అంజన్ రే ఇక్కడకు చేరుకున్నారు.
► ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, తదుపరి చర్యలను సూచించేందుకు ఇంటర్నల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
► లీక్ లీకేజీ అనంతర పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించారు.ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్ , ప్రొఫెసర్ ఎస్‌వీ నాయుడు, ప్రొఫెసర్ జె.బాబూరావు, డాక్టర్ భానుకుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
► ప్రస్తుత పరిస్థితిపై ఆయా కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తెలిపేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) సంస్థ నుంచి నిపుణులు విశాఖకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment