మెడికల్ రిప్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించాలి
ఒంగోలు టౌన్ : మెడికల్ రిప్రజంటేటివ్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించి న్యాయమైన వేతనం చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ.గిరి మాట్లాడుతూ కొంతకాలంగా తమ కంపెనీల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి నుంచి కలెక్టర్ వరకు చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మెడికల్ రిప్రజంటేటివ్స్‌కు సంబంధించిన స్పెషల్ యాక్ట్ 1976ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడేను సెలవు దినంగా అన్ని కంపెనీలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేల్స్ ప్రమోషనల్ ఎంప్లాయీస్ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని గిరి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రసాద్, కృష్ణమోహన్, అచ్యుత్, వేణు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.