రైలు మోత..
ఈ నెల 25నుంచి పెరగనున్న రైళ్ల ప్రయాణ చార్జీలు
రెట్టింపైన సీజన్ టికెట్ల ధరలు
జిల్లాలో పదివేలమందిపై పడనున్న ప్రభావం
సామాన్యుడిపై మొదలైన వడ్డన
2013-14 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదన మేరకు అమలు
సంగడిగుంట(గుంటూరు) రైలు చార్జీలు పెరగనున్నాయి. అన్నివర్గాలవారిపైనా భారం పడనుంది. ఇటు ప్రయాణచార్జీలు, అటు రవాణా చార్జీలు పెరుగుతుండటంతో నిత్యావసర సరకుల దరలు పెరిగి సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ప్రధాన రవాణా మార్గంగా ఉన్న రైలు ప్రయాణం ఇక ప్రియం కానుంది. ఈ నెల 25వ తేదీనుంచి పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపైనా పెంచిన ఛార్జీల భారం పడనుంది. గుంటూరు నుంచి మాచర్లకు బస్సులో వెళ్ళాలంటే 80 నుంచి 90 రూపాయలు ఛార్జీ అవుతుంది. అదే ప్యాసింజరు రైల్లో అయితే కేవలం 25 రూపాయలే ఉండటంతో అందరూ దానిపైనే ఆధారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం వీటి చార్జీలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సీజన్ టికెట్లూ భారమే...
జిల్లాలో దాదాపు 8వేల నుంచి పదివేల మంది ఉద్యోగులు, వ్యాపారులు సీజన్ టికెట్లు కొనుగోలు చేసుకుని నిర్థిష్ట ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై వీటి ధరలూ భారీగానే పెరగనున్నాయి. ఇప్పటివరకూ 15రోజుల ఛార్జీని లెక్కగట్టి మూడునెలలకు సీజన్ టికెట్‌గా అందిస్తుండేవారు. ఇది కాస్తా 30 రోజులకు లెక్కగట్టి రెట్టింపవనుంది. అదే విధంగా లగేజీ రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల రవాణాపై తీవ్ర రైలు మోత..ప్రభావం పడి వాటి ధరలు పెరగనున్నాయి.
అన్ని తరగతులపైనా 14.2శాతం పెంపుదల
2013-14 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు అన్ని తరగతులపైనా 14.2శాతం ధరలు పెరగనున్నాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు. పెరగనున్న ధరలు ఈ నెల 25నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న టికెట్లపై పెరిగిన చార్జీల ప్రకారం అదనపు సొమ్మును రిజర్వేషన్ కౌంటర్లలో గానీ, రైలులో ప్రయాణించే సమయంలోగానీ వసూలు చేస్తారని వివరించారు. ప్రతి స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు పెరిగిన ఛార్టీల వివరాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా సరకు రవాణా విషయంలో 2003 నుంచి అమలులో ఉన్న కనీస దూరం 100 కిలోమీటర్లనుంచి 125 కిలోమీటర్లకు పెంచారని పేర్కొన్నారు. వంద కిలోమీటర్ల లోపు రవాణా చార్జీ రాయితీని ఉపసంహరించారనీ, నాలుగు వర్గీకరణలుగా ఉన్న లో రేటెడ్ కేటగిరీలను మూడుకు కుదించి ఎల్‌ఆర్ 4 ను తొలగించారని వివరించారు