గరుగుబిల్లి : దేశంలో లెక్కకు మిక్కిలి చట్టాలు వస్తుంటాయి. కానీ వాటిలో ఎన్ని సక్రమంగా అమలవుతున్నాయంటే వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. చట్టాలను చేయడంలో పాలకులు ఎంత ముందుంటారో, అవే చట్టాలను అమలు చేయడంలో అధికారులు అంత వెనక ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీన్నే అలుసుగా తీసుకుని అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ వ్యాపారాలను వ్యాప్తి చేస్తున్నారు. వీటికి చక్కని ఉదాహరణ గరుగుబిల్లి మండలంలోని కొంకడివరం గ్రామ పరిధిలో ఏర్పాటైన క్వారీలు.
నిబంధనలను గాలికొదిలి..
కొంకడివరంలో ఏర్పాటు చేసిన క్వారీలు అన్ని అక్రమంగా ఏర్పాటు చేసుకున్నవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి అడ్డగోలు అనుమతులిచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అనుమతులు మంజూరు చేసిన అధికారులు ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలన్న సత్యాన్ని పక్కన పెట్టేశారు. దీనికి కారణం జిల్లా అధికార పార్టీ పెద్దల ఒత్తిడే అన్నది బహిరంగ రహస్యం. దీంతో క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారు.
ఇష్టా రీతిన పనులు చేయిస్తున్న క్వారీల యజమానులు..
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో, మామూళ్లు ఇచ్చి క్వారీ అనుమతులు తెచ్చుకున్న వ్యాపారులు లాభాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు చేటు తెస్తున్నారు. జనం వీటిపై కలెక్టర్, మైనింగ్, కాలుష్య నివారణ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వ్యాపారులను బ్లాస్టింగ్, క్వారీయింగ్ పనులు చేయనీయకుండా చేయగలిగారు. రెండు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. కానీ వ్యాపారులు మాత్రం స్థానికులపై మానసికంగా, శారీరకంగా భయపెడుతున్నట్లు సమాచారం.
ఇబ్బందుల్లో ప్రజలు, విద్యార్థులు..
కొంకడివరం సమీపంలో రెండు క్వారీలకు రెండు స్టోన్ క్రషర్లకే అనుమతులున్నాయి. కానీ వారు బాస్టింగ్స్ నిర్వహిస్తుండడంతో అంగన్‌వాడీ, పాఠశాల, ఇళ్ల భవనాలు బీటలు వారుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మూగ జీవాల ప్రాణనష్టం కూడా ఎక్కువే. దీనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సర్వే చేసిన తహసీల్దార్ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్లు నివేదికలో తేల్చిచెప్పారు. శ్రీ సత్యదుర్గా స్టోన్ క్రషర్ యాజమాన్యం సర్వే నంబర్ 4–3లో అనుమతులకు మించి 74 సెంట్లు, సర్వే నంబర్ 4 – 14లో 48 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్ 86–1లో ఉన్న కొమ్ముదువాని చెరువులో 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేసినట్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచ్ కొద్ది రోజులుగా ఆ రోడ్డును మూసివేసి రాకపోకలు నిలిపేశారు.
ఇష్టానుసారంగా బ్లాస్టింగ్స్..
క్వారీ యజమానులు ఎక్స్‌ప్లోజివ్స్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉండగా అవేమి చేయకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. వీరు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని విఘ్నేశ్వర ఎంటర్‌ప్రైజెస్ వారితో బ్లాస్టింగ్స్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి విఘ్నేశ్వర సంస్థవారు లావేరు మండల పరిధిలో మాత్రమే బ్లాస్టింగ్స్ చేసుకునేందుకు అనుమతులున్నాయి.
వ్యాపారుల కొమ్ముకాస్తున్న అధికారులు..
క్వారీల నుంచి రక్షించాలని అధికారుల వద్దకు వెళ్తే ఆ యజమానుల దగ్గర మామూళ్లు తీసుకుని ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 15 మంది వరకు కేసులు పెట్టారు. జిలెటిన్ స్టిక్స్ దొరికినా కూడా చర్యలు శూన్యం .
బ్లాస్టింగ్స్‌తో నష్టాలు..
పేలుళ్ల సమయంలో రాళ్లు తగిలి ప్రాణాలు పోయే అవకాశం, బీటలు వారుతున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పశువులకు మేత కరువు, ప్రాణ నష్టం కూడా, జనం రాకపోకలకు ఇబ్బందులు, క్రషింగ్ సమయంలో రాతి ధూళి, దమ్ము వలన వ్యాధులు వచ్చే అవకాశం, పనుల నిమిత్తం తిరిగే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం, ప్రజల కోసం నిర్మించిన రోడ్లు పాడవుతుండడం, పంట పొలాలు, తోటలు నాశనం అవుతుండడం.
ప్రజా సంక్షేమం పట్టదా..?
Published Wed, Mar 8 2017 3:09 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement