
అంగన్‌వాడీలకు సొంత భవనాలేవి?
మునుగోడు, న్యూస్‌లైన్ :మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాలకు నోచుకోవడం లేదు. వందలాది కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,801 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇం దులో 925 కేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి. మరో 880 కేంద్రాలు కమి టీ హాళ్లు, అదనపు తరగతి గదుల్లో కొనసాగుతున్నాయి. మిగతా 1996 కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రా ల్లో ఆట వస్తువులు ఉన్నా ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక అవి నిరుపయోగంగా ఉంటున్నాయి. గ్రామాల్లో అద్దె భవనాల కోసం ప్రభుత్వం నెలకు రూ. 200 చొప్పున కిరాయి చెల్లిస్తోంది.
కానీ, ఈ అద్దెకు భవనాలు దొరకడం లేదు. అద్దె ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను అద్దెకు ఇవ్వాలంటే ఇంటి యజమానులు జంకుతున్నారు. గ్రామం లో ఎక్కడో మూలకు పాడుపడ్డ గదుల్లో కేంద్రాలు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఇరుకైన భవనాల్లో వెలుతు రు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చిన్నగదుల్లో పౌష్ఠి కాహారం నిల్వ చేయడం, వంట చెరకు, ఆట వస్తువులు భద్రదపరుచుకోవడానికే స్థలం సరిపోతుంది. గర్భిణులు, బాలింతలకు టీకాలు వేయడానికి, పౌష్టికాహారం పంపిణీ చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అనువైన స్థలం లేక సక్రమంగా చేయలేక పోతున్నామని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు.