శిథిలాసవ్థలో గ్రామ పంచాయతీ భవనాలు
మునుగోడు: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాల అభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుందనేది సత్యం. వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక పాలక వర్గం ఉన్నా, వారు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి నేడు పనికిరాకుండా పోయాయి. దీంతో గ్రామ పాలకవర్గం, సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండలేక పోతున్నారు. శి«థిలమైన భవనంలో ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆదోళన చెందుతున్నారు. ఈ విషయం సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలిసినా వారు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది.
మండల వ్యాప్తంగా 11 భవనాలు శిథిలం..
మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి. కానీ అందులో 11 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ఈ స్థితికి చేరి దాదాపు 8 ఏళ్లు కావస్తున్నా వాటి విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా చీకటిమామిడి, ఇప్పర్తి, కల్వలపల్లి, సింగారం, వెల్మకన్నె గ్రామాల్లోని కార్యాలయాలు వర్షాకాలంలో కురుస్తూ స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అవి ఎప్పుడు కూలిపోతాయోన నే భయంతో ఆ భవనాల్లో ఉండేందుకు సర్పంచ్, ప్రభుత్వ ఉద్యోగులు సుముఖత చూపడంలేదు. దీంతో ఆ కార్యాలయాలు ఎప్పుడూ తాళం వేసి ఉంటున్నాయి. ఏదైనా ప్రభుత్వ కార్యకలపాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు దాని ఎదురుగా టెంట్‌ను ఏర్పాటు చేసి నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిథిలమైన భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు చేయించాలని పలువురు సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
కప్పు పై పెచ్చులు ఊడిపడుతున్నాయి.. – బూడిద మల్లేశ్వరి ( ఇప్పర్తి సర్పంచ్ )
గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలమవడంతో వర్షాకాలంలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. దీంతో అందులో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందోన నే భయమేస్తుంది. దానిని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మిస్తే బాగుండు.
టెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది దైంద అలివేలు( వెల్మకన్నె సర్పంచ్)
గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలం కావడంతో అందులో సభలు, సమావేశాలు నిర్వహించలేక పోతున్నాం. ఏదైనా ప్రత్యేకంగా నిర్వహించాల్సి వచ్చినప్పుడు బయట టెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మా పరిస్థితి ఎవరికి చెప్పినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.