ప్రేమకు ఉరి
♦ తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య
♦ కుమార్తెను ప్రేమించాడని తండ్రి ఘాతుకం
మలికిపురం: తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతో యువకుడిని ఓ తండ్రి ఉరి బిగించి హత్య చేశాడు. సముద్ర తీరంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల గ్రామంలో తన పరువు పోయిందన్న కసితో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గొల్లపాలేనికి చెందిన కందుల విజయకుమార్ కుమార్తె బిందు మాధవి, అదే మండలంలోని గూడపల్లి పల్లిపాలెం గ్రామానికి చెందిన కానుబోయిన నూకాలరావు కుమారుడు రామాంజనేయులు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం రామాంజనేయులు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. బిందుమాధవి అమలాపురం సమీపంలోని బట్లపాలెంలో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు.
యువతి తండ్రి విజయకుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటూ ఐదు నెలల క్రితం స్వస్థలానికి వచ్చాడు. కుమార్తె ప్రేమ విషయం తెలిసి రామాంజనేయులిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. తరువాత ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీసాలో లోపం కారణంగా మళ్లీ స్వస్థలానికి తిరిగి వచ్చేశాడు. అప్పటికీ వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. మే 2వ తేదీ రాత్రి రామాంజనేయులిని అతడి స్నేహితులైన గుండుమేను రవికిరణ్, కైల ప్రసాద్‌ల ద్వారా పార్టీ చేసుకుందామని పిలిపించాడు. అనంతరం తన మిత్రుడు మట్టా నాగబాబుతో కలసి, రామాంజనేయులు మెడ చుట్టూ తాడుతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు.
రామాంజనేయులు తండ్రి నూకాలరావు ఫిర్యాదు మేరకు మలికిపురం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం విజయకుమార్, నాగబాబును అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. గొల్లపాలెంలోని సముద్ర తీరంలో పాతిపెట్టిన రామాంజనేయులు మృతదేహాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులు వెలికితీశారు. కాగా ప్రేమించిన పాపానికి ఇంత దారుణానికి ఒడిగడతారా అని రామాంజనేయులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
నిందితులపై హత్య కేసు నమోదు: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో జరిగిన కానుబోయిన రామాంజనేయులు అదృశ్యం సంఘటనను హత్య కేసుగా నమోదు చేసినట్లు రాజోలు సీఐ క్రిస్టోఫర్ మంగళవారం తెలిపారు. తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు కందుల విజయకుమార్ అంగీకరించడంతో ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. విజయకుమార్‌తోపాటు అతడికి సహకరించిన మరో నిందితుడు మట్టా నాగబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. మరిన్ని వివరాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టుకు పంపిస్తామని వెల్లడించారు.