కాసుల దాహం | hospitals are corrupted | Sakshi
Sakshi News home page

కాసుల దాహం

Published Mon, Feb 17 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

కాసుల దాహం

కాసుల దాహం

కాసుల దాహం
 పెద్దాసుపత్రికి డబ్బు జబ్బు పట్టింది. జబ్బు ఎలాంటిదైనా.. వ్యాధి నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా మారింది. కాదు.. కాదు.. మార్చేశారు. అవసరం ఉన్నా.. లేకపోయినా.. ‘పరీక్ష’ పెడుతుండటంతో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.
 
  ఇప్పుడీ వ్యాపారం లక్షల్లో జరుగుతోంది. ల్యాబ్ నిర్వాహకులతో పాటు.. కొందరు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. కర్నూలుతో పాటు అనంతపురం, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల రోగులకు పెద్దాసుపత్రే ‘ప్రాణం’. ఎంతో ఆశతో ఇక్కడికొచ్చే రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరు వింటేనే హడలిపోతున్నారు. ఈ ప్రక్రియ ప్రహసనంగా తయారైంది. చీటీలు పట్టుకుని కాళ్లరిగేలా తిరుగుతూ సగం చచ్చిపోతున్నారు. తీరా ఆ విభాగానికి చేరుకున్నా సిబ్బంది తిట్ల పురాణం జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. నిపుణులైన రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఐదుగురు ఉన్నా కుర్చీలు కదలరనే అభిప్రాయం ఉంది. సెంట్రల్ ల్యాబ్‌ను ప్రస్తుతం ట్రైనింగ్ విద్యార్థులతో నెట్టుకొస్తున్నారు. మూత్ర పరీక్షకు ఉపయోగించే శాంపిల్ బాటిళ్లు సరిగ్గా శుద్ధి చేయడం లేదు. 33, 39, గైనిక్‌లోని ల్యాబ్‌లను మధ్యాహ్నం 12 గంటలకే మూసేస్తున్నారు. 24వ ల్యాబ్‌లో ప్రతి రోజూ 800 నుంచి 900 మంది వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్నారు. షుగర్ టెస్ట్ చేయించుకునే వారు టెక్నీషియన్ల కోసం 10 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఇక మూత్ర శాలలను శుభ్రం చేయకపోవడంతో రోగులు ముక్కు మూసుకుని పని కానిచ్చేస్తున్నారు.
 ప్రైవేట్ ల్యాబ్‌ల దందా
 ఆసుపత్రిలో కొన్ని ప్రత్యేక వ్యాధి నిర్దారణ పరీక్షలు తప్ప మిగిలినవన్నీ ఉచితంగా చేయాల్సి ఉంది. ఈ పరీక్షలు చేసేందుకు ప్రతి నెలా ఆసుపత్రి ఖజానా నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఆసుపత్రిలోని కొందరు వైద్యులు ప్రైవేట్ ల్యాబ్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆసుపత్రిలో పరీక్షలు సరిగ్గా ఉండటం లేదని.. త్వరగా ఇవ్వరనే సాకుతో మెడికల్, సర్జికల్, గైనిక్, పీడియాట్రిక్, సూపర్‌స్పెషాలిటీ విభాగాల వైద్యులు కొందరు ప్రైవేట్ ల్యాబ్‌లకు రాస్తున్నారు. అక్కడ రూ.30ల విలువ చేసే టెస్ట్‌కు రూ.100లు, రూ.50ల విలువ చేసే టెస్ట్‌కు రూ.200ల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి పరీక్షపై అదనంగా 60 నుంచి 70 శాతం వసూలు చేస్తుండగా.. ల్యాబ్‌ల నిర్వాహకులతో పాటు ఆ పరీక్షను బయటకు రాసిన వైద్యుల జేబు కూడా నిండుతోంది. గైనిక్‌వార్డు నుంచి హెచ్‌బీ(హిమోగ్లోబిన్) టెస్ట్‌ను సైతం బయటకు రాస్తున్నారంటే వైద్యులు ఎంతకు దిగజారారో తెలియజేస్తోంది. ఎండోక్రైనాలజి, నెఫ్రాలజి, యురాలజి, కార్డియాలజి, మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్ విభాగాల నుంచి కొందరు వైద్యులు ప్రతి ఒక్క టెస్ట్‌ను ప్రైవేట్‌కే రాసేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ అధికంగా కర్నూలు మెడికల్ కాలేజీలోని బయోకెమిస్ట్రీ, పెథాలజి విభాగాల వైద్యులు కొందరు డ్యూటీ టైంలోనే వెళ్లి రిపోర్టులు రాసిస్తున్నా కళాశాల అధికారులు మైనం దాల్చడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. కొందరు జూనియర్ వైద్యులు సైతం బయటకు పరీక్షలు రాస్తుండటంతో వారికి అవసరమైన ఖరీదైన పుస్తకాలు, బహుమతులు ల్యాబ్ నిర్వాహకులు ముట్టజెబుతున్నట్లు సమాచారం.
 ఆరోగ్యశ్రీ నుంచి బిల్లుల క్లెయిమ్
 ఆసుపత్రిలో అందుబాటులోని వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం బయట చేయిస్తున్న వైద్యులు, ఆ బిల్లులను ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు క్లెయిమ్ చేసిస్తూ ఆసుపత్రి ఖజానాకు చిల్లు పెడుతున్నారు. రోగులు సైతం తాము ప్రైవేట్‌లో పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకంతో వైద్యులు సూచించిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. ఒక్కో రోగి డిశ్చార్జ్ అయ్యేలోపు మూడు నుంచి నాలుగు ప్రైవేటు ల్యాబ్‌ల బిల్లులు ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్ చేసుకుంటున్నారు. సగటున ఒక్కో రోగి రూ700 నుంచి రూ.1200 వరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కుమ్మరిస్తున్నారు. ఏళ్ల తరబడి అడ్డదారిలో ఆరోగ్యశ్రీ బిల్లులు క్లెయిమ్ అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement