కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : హాస్టళ్లను గాడినపెట్టేందుకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో హాస్టల్ సమావేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అనుకున్న రీతిలో హాజరుకాలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో తల్లిదండ్రుల సమావేశాలు జరిగాయి. అయితే చాలా హాస్టళ్లలో ఒకరిద్దరు మాత్రమే హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ఆదివారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు.
దీంతో మొదటి సమావేశాలకే విఘ్నం ఏర్పడింది. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి బీసీ సంక్షేమ శాఖ ఏడీ శ్రీధర్‌రెడ్డి సమావేశాలకు పరిశీలకుడిగా వచ్చారు. జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం హాస్టళ్లను సందర్శించి, తల్లిదండ్రుల సమావేశాలకు హాజరయ్యారు. కాగా ప్రతి నెల మొదటి వారంలో హాస్టళ్లలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తామని, వచ్చే సమావేశాలకు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యేట్లు చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎం.చంద్రశేఖర్ తెలిపారు.
హాస్టల్ సమావేశాలకు ‘సమ్మక్క’ ఎఫెక్ట్
Published Mon, Feb 3 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement