ఇల్లంతకుంట(బెజ్జంకి), న్యూస్‌లైన్: ప్రేమలో మోసపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి బెజ్జంకి మండలం చీలాపూర్‌కు చెందిన ఇంటర్ చదువుతున్న గంగాధర సత్య(19) క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. గ్రామానికి చెందిన చిలువేలు ప్రవీణ్ ఆమెను ప్రేమించి, పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యం చేసుకుందని ఎస్సై దుర్గా తెలిపారు.
సత్య బెజ్జంకిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ప్రవీణ్‌తో స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునేందుకు కూడా ఒప్పుకున్నాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. కొద్ది రోజుల అనంతరం ప్రవీణ్ పెళ్లికి నిరాకరించాడు. ఇది తట్టుకోలేక సత్య ఇంట్లోనే క్రిమి సంహారకమందు తాగింది. గమనించిన ఆమె తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. తమ కూతురును ప్రవీణ్ మోసం చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని సత్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గా తెలిపారు.
అవమానం భరించలేక..
గొల్లపల్లి: శుభకార్యంలో భోజనం చేస్తుండగా తోసి వేయడంతో అవమానం చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మండలంలోని చెక్కపల్లికి చెందిన చిన్న నారాయణ(55) తన బంధువు ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లగా గ్రామానికి చెందిన కొందరు తోసివేయడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఆయన తన బంధువు శ్రీనివాస్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేస్తుండగా చెక్కపెల్లి దుబ్బయ్యతో గొడవ జరిగింది. ఇక్కడ గొడవ పెట్టుకోవద్దని నారాయణను గ్రామానికి చెందిన గోలి తిరుపతి, గోలి మల్లయ్య తోసేవేశారు. అంతేకాకుండా దుర్భాషలాడారు. దీంతో ఆయన అవమానంగా భావించాడు. ఇంటికి వచ్చిన నారాయణ కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పి బాధపడ్డాడు. బంధువుల మధ్య అవమానించారని కుమిలిపోయాడు. వేకువజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిరంజన్‌రెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
జూలపల్లి: మండలంలోని కుమ్మరికుంటకు చెందిన వీసారపు లచ్చయ్య(50) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన ఆయన ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సాయంత్రం గ్రామ శివారులో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయనను పెద్దపల్లిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Sat, Nov 9 2013 3:33 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement