గురజాలకు చెందిన సురేంద్ర లక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండేవాడు. గుంటూరు నగర శివారులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తానుంటున్న హాస్టల్‌కు నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హాస్టల్ నుంచి మార్చి 21న తన సొంత ఊరు గురజాలకు వెళ్లిపోయాడు. సోమవారం లక్ష్మీపురంలో తాను ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. హాస్టల్ నుంచి లగేజీ తీసుకువెళ్లాలంటే నెలకు రూ.3 వేల చొప్పున నాలుగు నెలలకు రూ.12 వేలు కట్టాలని హాస్టల్ యజమాని తేల్చి చెప్పాడు. మీరు లేకపోయినా తాను హాస్టల్ అద్దె, కరెంటు బిల్లులు కట్టాలని యజమాని లగేజీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో వాగ్వాదానికి దిగిన అతను తన లగేజీని హాస్టల్‌లోనే వదిలి వెళ్లిపోయాడు. ఈ సమస్య ఒక్క సురేంద్రదే కాదు దాదాపుగా ప్రైవేట్ హాస్టళ్లలో ఉన్న చాలా మంది విద్యార్థులది.
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరం, పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యా సంస్థల్లో చదవడానికి వేలాది మంది విద్యార్థులు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వస్తుంటారు. బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు హాస్టల్‌లో ఉంటూ కళాశాలలకు వెళుతుంటారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువత, వివిధ రకాల కోర్సులు చేసే విద్యార్థులు, చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు హాస్లల్‌లో చేరుతుంటారు. గదులు అద్దెకు తీసుకుని వంట చేసుకుని ఉండడం కన్నా.. హాస్టల్‌లో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. హాస్టల్‌లో టైం ఆహారం, మినరల్ వాటర్, స్నానానికి వేడి నీళ్లు, ఇంటర్నెట్ సదుపాయం వంటివి వారికి అందుబాటులో ఉంటాయి. ఇటువంటి వారి కోసం దాదాపు నగరంలో 300 దాకా చిన్నా, పెద్ద ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. దాదాపు 2,500 మంది హాస్టళ్లలో ఉంటున్నారు. వీరిలో విద్యార్థులే అధికం. ప్రస్తుతం నగరంలో నెలకు రూ.4 నుంచి రూ.6 వేల దాకా హాస్టల్ ఫీజలు వసూలు చేస్తున్నారు.
అంత డబ్బు ఎలా కట్టాలి?
కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హస్టళ్లలో ఉండే విద్యార్థులు నాలుగు నెలలుగా హాస్టల్ వదిలి ఇంటిపట్టున ఉంటున్నారు. తిరిగి కొద్ది రోజుల్లో విద్యాసంస్థలు ప్రారంభమవుతాయన్న ఆలోచనతో వారి లగేజీ ఇక్కడే వదలి వెళ్లారు. కరోనా రోజురోజుకూ పెరిగిపోతుండడం, ఇప్పట్లో విద్యా సంస్థలు ప్రారంభం కావన్న ఆలోచనతో విద్యార్థులు లగేజీ కోసం హాస్టల్‌కు వస్తున్నారు. అయితే హాస్టళ్ల యజమానులు నెలకు రూ.3 వేలు దాకా కట్టమని డిమాండ్ చేస్తున్నారని, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు. లగేజీ ఉంచుకున్నందుకు నెలకు రూ. వెయ్యి దాకా అయితే కట్టగలమని తేల్చిచెబుతున్నారు. కొంత మంది విద్యార్థులు రూ.12 వేలు కట్టడం కన్నా ఉన్న ఆ కొద్ది లగేజీని వదిలి డబ్బులు కట్టకుండా తిరిగి వెళుతున్నారు. ఇటువంటి వారితో పలు హాస్టళ్ల వద్ద వాగ్వాదాలు జరుగుతున్నాయి.
లాక్‌డౌన్‌తో చాలా నష్టపోయాం
నాలుగు నెలలుగా విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నామని ప్రైవేట్ హాస్టల్ యజమానులు వాపోతున్నారు. అప్పటి నుంచి తమకు అద్దె, మెస్ ఫీజులు చెల్లించలేదని, తాము మాత్రం హాస్టల్ భవనం అద్దెలు, కరెంటు చార్జీలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. హాస్టల్‌లో లగేజీ ఉండడంతో వాచ్‌మెన్‌లకు పూర్తి జీతాలు, ఇతర సిబ్బంది వెళ్లిపోకుండా వారికి సగం జీతాలు ఇస్తున్నామన్నారు. వీటన్నింటికి అప్పులు తెచ్చి కడుతున్నామంటున్నారు. విద్యార్థులు కొంతమంది లగేజీ తక్కువగా ఉండడంతో డబ్బులు కట్టకుండా లగేజీ వదిలి వెళ్లిపోతున్నారని, ఇలాంటి వారి వల్ల చాలా నష్టపోతున్నామనిలబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment