తెరుచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు | BC Welfare Hostels Open For Tenth Class Exams | Sakshi

వసతికి ఓకే

Jun 3 2020 11:53 AM | Updated on Jun 3 2020 12:45 PM

BC Welfare Hostels Open For Tenth Class Exams - Sakshi

పాల్వంచలోని బీసీ సంక్షేమ వసతిగృహం

పాల్వంచ రూరల్‌: కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన సంక్షేమ వసతి గృహాలు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. మార్చిలో వాయిదా పడిన ‘పది’ పరీక్షలు తిరిగి ఈనెల 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మొత్తం 66 హాస్టళ్లను సోమవారం పునః ప్రారంభించారు. రేపటి(గురువారం) నుంచి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతిస్తారు. గతంలో  హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాయడం క్షేమం కాదని, భోజన సౌకర్యం లేకుంటే ఇబ్బంది పడతారని భావించిన ప్రభుత్వం.. హాస్టళ్లను తెరవాలని నిర్ణయించింది.

పరీక్షలకు 3,298 మంది హాస్టళ్ల  విద్యార్థులు..
జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 39 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 23 బాలుర, 16 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే బాలురు 1,253 మంది కాగా, బాలికలు 1,630 మంది ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు బాలురకు 11 ఉండగా 180 మంది, 5 బాలికల హాస్టళ్లలో 55 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లుబాలికలకు 4, బాలురకు 7 ఉన్నాయి. వీటిలో 93 మంది బాలురు, 87 మంది బాలికలు పదో తరగతి చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 66 హాస్టళ్లకు 3,298 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

గదికి నలుగురే..
పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులంతా హాస్టళ్లలోనే నివాసం ఉండాలి. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదిలో నలు గురు విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. హాస్టళ్లకు వచ్చే ముందే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ శానిటైజ్, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. అందరికీ మాస్క్‌లు అందజేస్తారు. భౌతికదూ రం పాటించేలా వార్డెన్లు అవగాహన కల్పిస్తారు. పరీక్ష రాసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్‌ ఏర్పాటు చేస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్‌ తెలిపారు. ప్రతిరోజూ ఆల్పాహారంగా ఇడ్లీ, లేదా కిచిడీ పెడతామన్నారు. ఉదయం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, రాగి జావ అందిస్తామని, బుధ, ఆది వారాల్లో చికెన్‌తో భోజనం, ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి ఆరు రోజులు ఆరటిపండు, శనివారం స్వీట్‌ అందజేస్తామని వివరించారు. విద్యార్థులకు కరోనా వైరస్‌ రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులకు భోజనంతో పాటు బూస్ట్‌ పాలు, బిస్కెట్లు అందించనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ పీఎంఓ రమణయ్య తెలిపారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీ సంక్షేమాధికారి సురేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement