సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి గుంటూరు: నరసరావుపేటపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా వ్యాప్తి చెందకుండా కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేక అధికారులుగా తెనాలి సబ్ కలెక్టర్ దినేష్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపరెడ్డిలను నియమించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసేందుకు వీలుగా అదనపు ఎస్పీ చక్రవర్తితోపాటు, పోలీసులను భారీగా మొహరించారు.
► జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనంద్‌కుమార్ నరసరావుపేటలో రెండు మార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
► కరోనా కట్టడిలో భాగంగా ముందు రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లాలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో నాల్గో విడత ఇంటింటి సర్వే వేగవంతం చేశారు.
► గుంటూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సైతం ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న 97 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 201 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాలో రికవరీ రేటు 31.70 శాతంగా ఉంది. రోగుల సగటుతో పోలిస్తే జిల్లాలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది.
► జిల్లాలో శుక్రవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నరసరావుపేటలో 17 కేసులు నమోదు కాగా, అక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 121కు చేరింది. గుంటూరులో ఒక కేసు, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళలో ఒక కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.
పేటపై స్పెషల్ ఫోకస్
Published Sat, May 2 2020 12:13 PM | Last Updated on Sat, May 2 2020 1:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment