హోటల్‌ వ్యాపారం కుదేలు ! | Hotel Business Loss With Lockdown And Coronavirus in Guntur | Sakshi
Sakshi News home page

హోటల్‌ వ్యాపారం కుదేలు !

Published Wed, Jun 24 2020 1:23 PM | Last Updated on Wed, Jun 24 2020 1:23 PM

Hotel Business Loss With Lockdown And Coronavirus in Guntur - Sakshi

అరండల్‌పేటలో వెలవెలబోతోన్న హోటల్‌

సాక్షి, గుంటూరు: కరోనా కాటుకు హోటల్‌ వ్యాపారం కుదేలైంది. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపుల అనంతరం కూడా భోజన ప్రియులు లేక హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. జిల్లాలోని గుంటూరు నగరం, నరసరావుపేట, తెనాలి, పిడుగురాళ్ల, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో బిజినెస్‌ డల్‌ గానే ఉంటోంది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రభుత్వం రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా హోటళ్లు, రెస్టారెంట్‌లలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్, శానిటైజేషన్, సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు వంటి అన్ని నిబంధనలను నిర్వాహకులు పాటిస్తున్నారు. లాక్‌ డౌన్‌కు ముందులా ప్రస్తుతం బిజినెస్‌ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. 

వేలాది కుటుంబాల జీవనం...
గుంటూరు నగరంలో ట్రేడ్, లేబర్, ఫుడ్‌ లైసెన్స్‌ పొందిన హోటళ్లు, రెస్టారెంట్‌లు 200లకు పైగా ఉన్నాయి. అనే జిల్లా వ్యాప్తంగా 500 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా నడిచే హోటళ్లు అనేకం. ఈ రంగంపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా 60 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో జరిగే బిజినెస్‌లో ప్రస్తుతం పది శాతం కూడా జరగడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. దీంతో సిబ్బంది జీతాలు, అద్దెలు, కరెంట్‌ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విడతల వారీగా సిబ్బందిని పనిలోకి ...
హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఆహారానికి పెద్దగా డిమాండ్‌ లేకపోతుండటంతో నిర్వాహకులు అదనపు భారాన్ని తగ్గించుకుంటున్నారు. ఉన్న సిబ్బందిలో కొందరు చొప్పున రోజు రోజు మార్చి విడతల వారీగా పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా వ్యాప్తి చెందుతుందని...
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా వరకూ ప్రజలు బయటి ఆహారానికి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. తప్పనిసరి అయితే తప్ప రెస్టారెంట్లు, హోటళ్లను ఆశ్రయించడం లేదు. ఒకటి రెండు సార్లు ఆలోచించి, ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు వంటివి గమనించే ఆహారం తినడం, పార్సిల్‌ తీసుకోవడం చేస్తున్నారు.  

కష్టంగాఉంది
మునుపటి రోజుల్లో కౌంటర్‌ రోజుకు రూ.10–20 వేలు జరిగేది. ప్రస్తుతం అందులో సగం కూడా ఉండటం లేదు. మా మెస్‌లో 40 సీట్లు ఉంటే భౌతిక దూరం పాటిస్తూ ప్రస్తుతం 14 సీట్లు ఏర్పాటు చేశాం. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. బిజినెస్‌ జరగకపోతుండటంతో సిబ్బందిని పరిమితంగా పనిలో పెట్టుకోవాల్సి వస్తోంది.  – శివాజి, మెస్‌ నిర్వాహకుడు

ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి
లాక్‌డౌన్, కరోనా ప్రభావం కారణంగా హోటల్‌ రంగం పూర్తిగా కుదేలైంది. కరెంట్‌ బిల్లులు కూడా కట్టడం కష్టంగా మారుతోంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. కరెంట్‌ చార్జీల చెల్లింపుల్లో మినహాయింపులు ఇవ్వాలి. ప్రోత్సాహం అందించకపోతే మనుగడ కష్టంగా మారుతుంది.  – కిషోర్, గుంటూరు నగరం హోటల్స్‌అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement