నెల్లూరు (పొగతోట/కలెక్టరేట్/బారకాసు), న్యూస్‌లైన్ : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వసతిగృహ అధికారుల తీరు తయారైంది. మూడురోజులుగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అల్లాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పారాసిట్‌మాల్, మెట్రాండిజోల్ మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 23 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో వసతిగృహ అధికారులు హడావుడి చేశారు. స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్దనున్న తిక్కవరపు మీనమ్మ ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలోని విద్యార్థినులు కలుషిత నీరు అస్వస్థతకు గురయ్యారు. 23 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డీఎస్‌ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వసతిగృహ ఉన్నతాధికారుల సమాచారంతో కలెక్టర్ శ్రీకాంత్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వసతిగృహ విద్యార్థుల కోసం నిర్మించిన గ్రౌండ్ లెవల్ వాటర్ ట్యాంక్‌లో నీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లెవల్‌లో ఉండటంతో డ్రైనేజీ వాటర్ మంచినీరులో కలసి కలుషితమైంది. అలస్యంగా తెలుసుకున్న వసతి గృహ అధికారులు కార్పొరేషన్ అధికారులకు సచాచారం ఇవ్వడంతో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. వసతి గృహంలో పారిశుధ్యం అధ్వన్నంగా ఉంది. హాస్టల్‌కు ఎదురుగా సులభ్‌కాంప్లెక్స్ నిర్మించారు. విద్యార్థులు దుర్గంధం భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. మార్కెట్‌లోని వ్యాపారులు వసతి గృహం వద్ద మూత్ర విసర్జన చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. వసతి గృహం వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.
వసతి గృహంలో విద్యార్థుల కోసం గత కలెక్టర్ శ్రీధర్ ఆర్‌ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ఆర్‌ఓ ప్లాంట్స్ మరమ్మతులకు గురై నాలుగు నెలలు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. రిపేరు ఎవరు చేస్తారో తెలియక పట్టించుకోలేదని వసతి గృహ అధికారి జ్యోతిరాణి చెప్పడం విడ్డూరంగా ఉంది. హాస్టల్ సముదాయంలో మూడువసతి గృహాల్లో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్స్ మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గత మూడేళ్లుగా విద్యార్థినులకు వైద్యసేవలు అందడంలేదు. ప్రతి రెండో శనివారం వసతి గృహంలోని విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఉదయం టిఫెన్, రాత్రికి భోజనం వసతి గృహంలో అందిస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.
విద్యార్థినులతో నిండిన జిల్లా ఆస్పత్రి
డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల (పెద్దాస్పత్రి)లో విద్యార్థినులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఠాగూర్, ఆర్‌ఎంఓ డాక్టర్ ఉషాసుందరి పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల అన్ని సౌకర్యాలతో తిర్చిదిద్దిన ఆస్పత్రిలోని సాధారణ వార్డును విద్యార్థినులకు కేటాయించారు. ఎప్పటికప్పుడు వైద్యసేవల విషయమై పర్యవేక్షించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, నగర డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, తహశీల్దార్ నరసింహులు, డీఎస్‌డబ్ల్యూఓ నాగేంద్రరావు, తదితర అధికారులు పెద్దాస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అలాగే హాస్టళ్ల వార్డన్లు కూడా ఆస్పత్రి వద్ద ఉంటూ అవసరమైన సేవలందిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన
తమ పిల్లలు అస్వస్థతకు లోనైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హుటాహుటిన పెద్దాస్పత్రికి చేరుకున్నారు. పిల్లల ఆరోగ్యంపై సిబ్బందిని అడిగి తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. బెడ్లపై వైద్యం పొందుతున్న పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుని ఏమీ కాదమ్మా నీకు అంటూ ఓదార్చుతూ అక్కడే ఉండిపోయారు. పిల్లలకు ఏమీ కాదని వైద్యులు భరోసా ఇవ్వడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
హాస్టల్ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు
ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని కలెక్టర్ శ్రీకాంత్ వార్డెన్లను హెచ్చరించారు. కలుషిత నీటివల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆయన తీవ్ర స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నగరంలోని మద్రాస్‌బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. కలుషితనీటికి కారణైమైన మెయిన్‌పైప్‌లైన్‌ను వెంటనే మార్చాలని కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కొత్త పైప్‌లైన్‌ను వేయాలని సూచించారు. అప్పటి వరకు విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలన్నారు. తాగునీటి పైప్‌లైన్లు శిథిలావస్థకు చేరితే ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గృహ అవసరాలకు వినియోగించే పైప్‌లైన్లు దెబ్బతిన్నాయన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పైప్‌లైన్లు దెబ్బతిని మురుగునీరు పంపిణీ అవుతుందన్న విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ఎందుకు గుర్తించడంలేదన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దంటూ తీవ్రంగా మందలించారు.
కలుషితం కాటేసింది
Published Thu, Jan 9 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement