గుండెమండిన రైతన్న
రైతన్న గుండె మండింది... తుపాను సాయంలోనూ నిర్లక్ష్యాన్ని భరించలేక ఒక్కసారిగా భగ్గుమంది....ప్రకృతి వైపరీత్యాన్ని సైతం తట్టుకున్న అన్నదాత, అధికారుల వంచనను భరించలేకపోయాడు. పంటపోయి కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్న రైతన్నను ఆదుకోవలసిన అధికారులు తమకు తోచిన విధంగా పంటనష్టం జాబితాలను రూపొందించడంతో వారు భరించలేపోతున్నారు. హుద్‌హుద్ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులు, మళ్లీ పెట్టుబడులు పెట్టి కూలీలతో పంటను కోయించలేక పశువుల మేతకు వదిలేశారు. కంటిపాప కన్నా మిన్నగా కాపాడుకున్న పంటను ఇంటికి తరలించే స్థోమతలేక ఓ రైతు ఏకంగా పొలానికి నిప్పుపెట్టాడు.
బలిజిపేట రూరల్:మండలంలోని పెద్దింపేట పంచాయతీ పరిధిలో ఉన్న గౌరీపురంలో రైతుల ఆగ్రహం, ఆవేదన కట్టలు తెంచుకుంది. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ కనీసం సాయమందించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు రైతులకే సాయం లేకపోతే తమ పరిస్థితి ఏంటని వారు మధన పడుతున్నారు. సాయం సంగతి అలా ఉంచితే పండిన కొద్దిపాటి పంటను ఇంటికి చేర్చే దారిలేక పశువుల మేతకు వదిలేశారు. తూముల వెంకటరమణ అనే రైతు వేరే గత్యంతరం లేక, పండిని కొద్దిపాటి చేలను ఇంటికి తీసుకువెళ్లే స్థోమత లేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం పొలానికి నిప్పంటించారు. ఈయన అదే గ్రామంలో లోలుగు శ్రీనివాసరావు అనే రైతు వద్ద నుంచి ఎకరాకు 10 బస్తాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని 2.40 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు.
దానిలో వరి పంటవేసేందుకు రూ.22 వేలు మదుపు పెట్టాడు. తగినంత సొమ్ములేకపోవడంతో రూ.10వేలు అప్పుతెచ్చి మరీ మదుపు పెట్టాడు. వెంకటరమణ, ఆయన భార్య రెక్కలు ముక్కలు చేసుకుని, చెమటను చిందించి పండించారు. అయితే ప్రకృతి కన్నెర చేసింది. హుద్‌హుద్ తుపాను రూపంలో విరుచుకుపడింది. సువర్ణముఖి నది పొంగి పొలాలమీదుగా ప్రవహించింది. ఆ సమయంలో అధికారులు గ్రామం మొత్తాన్ని ఖాళీచేయించి పెద్దింపేట పంపించివేశారు. మరుసటి రోజు నీరు తగ్గుముఖం పట్టడంతో అందరూ తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కాని పంటపొలాల్లో సుమారు ఆరు రోజుల పాటు నీరు నిల్వ ఉండిపోయింది. వెంకటరమణ పొలంతో పాటు గ్రామంలో 300 ఎకరాల్లో పంట దెబ్బతింది.
అయితే పొలాలను పరిశీలించిన అధికారులు సుమారు 23 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని జాబితాలు తయారు చేశారని ఆ గ్రామానికి లక్ష్మణరావు, అప్పలనాయుడు, రామారావు, రామకృష్ణ, కృష్ణమూర్తి తదితరులు తెలిపారు. దీనిపై జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా దోమపోటుతో పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు... జిల్లా అధికారుల వద్ద కాకమ్మ కథలు చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రైతులకే పంటనష్టపరిహారం ఇవ్వకపోతే కౌలుకు భూమిని తీసుకున్న తనను ఎవరు ఆదుకుంటారని తూముల వెంకటరమణ వాపోయాడు. పంటను కూలీలతో కోయించేందుకు మదులుపెట్టలేక, అక్కడక్కడక పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేక నిప్పు పెట్టామని తెలిపాడు.
అధికారుల నిర్లక్ష్యానికి బలి
అధికారులు, పాలకుల నిర్లక్ష్యాని బలయ్యామని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని గ్రామాన్ని వదిలి వలసపోవలసిందేనని వారు తెలిపారు. రుణమాఫీలు అంతంతగానే వర్తించడంతో ఆ అప్పులు, పంట మదుపులకు చేసిన అప్పులు కలిసి తడిసిపోపెడయ్యాయని, తాము పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయామని చెప్పారు. గ్రామంలో కౌలు రైతులు, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పండిన భూములకు తక్కువ దిగుబడి వచ్చిందని చెప్పారు.
నష్టం వివరాలు...
రెండు ఎకరాల భూమిని కౌలుకు చేసుకుంటున్న పాడి లక్ష్ముందొర పంట పూర్తిగా పోయింది. అలాగే పాడి సూరందొర, జడ్డు సత్యనారాయణ రెండేసి ఎకరాల్లో వేసిన పంటకు, వంజరాపు మహేశ్వరావు అనే రైతు మూడు ఎకరాల్లో వేసిన పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది. తూముల పెదసత్యనారాయణ, జోగి అప్పలనాయుడు అనే రైతులకు ఎకరాకు ఐదు, సాదు రంగునాయుడు, జోగి లక్ష్మణరావుకు ఆరు బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. జోగి అప్పలనాయుడు, కృష్ణమూర్తి ఎనిమిదేసి ఎకరాల్లో పంటవేయగా 40 సెంట్ల చొప్పున అధికారులు నష్టపరిహారం రాశారని రైతులు తెలిపారు. ఇప్పటికీ హుద్‌హుద్ తుపాను నష్ట పరిహారం గురించి అధికారులు ప్రకటించడం లేదని వారు వాపోయారు.
వేరే గతిలేక...
కౌలు భూమి పండలేదు. వేరే గతి లేక, దిక్కుతోచక పం టను తగులపెట్టాను. అప్పుల ఊబిలోంచి వచ్చే అవకాశాలు లేవు. అధికారులు అన్యాయం చేశారు. ఇంక వలసలే శరణ్యం.
- టి.వెంకటరమణ, రైతు.
తీవ్ర నష్టం వాటిల్లింది, కాని అరకొరగా రాశారు...
పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాని అధికారుల పర్యవే క్షణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బంది, అరకొరగా పంట నష్టాన్ని అంచనావేశారు. హుద్‌హుద్ కారణంగా పంట నష్టపోతే దోమకాటు వల్ల జరిగిందన్నారు. ఇదెక్కడి న్యాయం, రైతులంతా ఇంత నిర్లక్ష్యమా
- జోగి అప్పలనాయుడు, రామారావు, పాడి లక్ష్మందొర, రైతులు