
నీరుగారుతున్న పరిశ్రమ
పీఎన్ కాలనీ : హుద్‌హుద్ తుపాను విధ్వంసం సృష్టించి రెండు నెలలు దాటినా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపశమనం లభించలేదు. తుపాను దాటికి జిల్లాలో మొత్తం 64 పరిశ్రమలకు రూ.168.68 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు నిర్థారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. పరిశ్రమలు మూతపడకుండా, కార్మికులు ఉపాధి కోల్పోకుండా ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఉపశమనం కలిగిస్తుందని ఆశించిన యజమానులకు నిరాశే మిగిలింది. నివేదిక అందిన కొన్ని రోజులకే నష్టపోయిన పరిశ్రమలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదనిపరిశ్రమల యజ మానులు నిస్పృహ చెందుతున్నారు. తుపాను దాటికి జరిగిన నష్టంతోపాటు రోజుల తరబడి విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు పనిచేయక పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అప్పుల్లో కూరుకుపోయాయి. కొన్ని పరిశ్రమలు ఏకం గా మూతపడ్డాయి.
బీమా సౌకర్యం ఉన్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఇన్సూరెన్సు కంపెనీలు ఇచ్చిన బీమా పరిహారంతో ఉత్పత్తిని పునరుద్ధరించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత కొద్దిరోజుల వ్యవధి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పలు కమిటీలు, బృందాలు వచ్చి పరిశీలిం చినా ఎటువంటి సాయం ఇస్తారన్నదే ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన వైఖరి స్పష్టం చేయాలని పరిశ్రమల యజమానులు, కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ వద్ద ప్రస్తావించగా తుపాను నష్టాల నిర్థారణకు ప్రభుత్వం కమిటీని వేసిందన్నారు. ఈ కమిటీ సూచనల ఆధారంగా నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లాలో పరిశ్రమలకు వాటిల్లిన నష్టాలపై సమర్పించిన నివేదికకు స్పందనగానే ప్రభుత్వం ఈ కమిటీని వేసిందన్నారు.